
లండన్: వచ్చే మార్చిలో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్లో చరిత్రాత్మక ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మేకు ఎంపీలు షాకిచ్చారు. ఇటీవలి కాలంలో ఒక యూకే ప్రభుత్వం పార్లమెంట్లో ఇంత ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. హౌస్ ఆఫ్ కామన్స్(దిగువసభ)లో 8 రోజుల పాటు బిల్లుపై సుధీర్ఘ చర్చ జరగగా జరగగా 200 ప్రసంగాలు నమోదయ్యాయి. బెగ్జిట్కు అనుకూలంగా ఓటు వేయాలని కోరిన థెరిసా మే అభ్యర్థనను ఎంపీలు పట్టించుకోలేదు.1924 తర్వాత ఓటింగ్‌లో భారీ సంఖ్యలో సభ్యులు వ్యతిరేకంగా ఓటువేయడం ఇదే తొలిసారి. బ్రెగ్జిట్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందంటూ అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 230 ఓట్ల ఆధిక్యంతో ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది.. అనుకూలంగా 202 ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే థెరిసా మే ప్రభుత్వంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. థెరిసా ప్రభుత్వానికి ఇప్పుడు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. విశ్వాస తీర్మానంలో ఆమె ప్రభుత్వం ఓడిపోతే మళ్లీ సాధారణ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.