ఉద్యోగం కోసం 32 కిలోమీటర్లు నడిచాడు.. బాస్ కొత్త కారు ఇచ్చాడు!

Wed,July 18, 2018 05:15 PM

Boss gave car to employee after he walked 32 KM to join the new job

అలబామా: కొత్తగా ఉద్యోగం వచ్చింది. తెల్లారితే డ్యూటీలో చేరాలి. తన దగ్గరున్న కారు చెడిపోయింది. దీంతో అతను 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీ కస్టమర్ దగ్గరికి నడక ప్రారంభించాడు. అలా రాత్రంతా నడిచాడు. మొత్తానికి అనుకున్న సమయానికే అక్కడికి చేరాడు. అతని కథ విన్న కంపెనీ బాస్ ఎంతగానో ముచ్చటపడి అప్పటికప్పుడు ఓ కొత్త కారును అతనికి బహుమతిగా ఇచ్చాడు. అది అందుకున్న ఆ ఉద్యోగి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఆ కారు అందుకున్న వ్యక్తి పేరు వాల్టర్ కార్. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో నివాసం ఉంటాడు. ఓ మూవింగ్ కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. ఉదయం 8 గంటల కల్లా ఆ కంపెనీ కస్టమర్ జెన్నీ లామీ దగ్గరికి అతను వెళ్లాల్సి ఉంది. సడెన్‌గా తన కారు పాడయింది. ఎలాగైనా అక్కడికి వెళ్లాలని నిర్ణయించిన కార్.. రాత్రంతా నడుచుకుంటూ వెళ్లాడు. మధ్యలో పెల్హామ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి అతన్ని విచారించగా.. కార్ అసలు విషయం చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అతని కమిట్‌మెంట్‌ను మెచ్చుకుంటూ తీసుకెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేయించాడు. ఆ తర్వాత కస్టమర్ జెన్నీ లామీ ఇంటికి ఆ పోలీస్ అధికారే అతన్ని తీసుకెళ్లాడు.


ఉదయం 8 గంటల కల్లా తమ ప్రతినిధి వస్తాడని కంపెనీ చెప్పగా.. ఉదయం 6.30 గంటలకే అతడు అక్కడికి చేరుకున్నాడు. ఆ పోలీస్ అధికారే కార్ ఇక్కడి వరకు ఎలా వచ్చాడో లామీకి చెప్పాడు. ఆమె అతని స్టోరీని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. మాకు సాయం చేయడానికి అతను హోమ్‌వుడ్ నుంచి పెల్హామ్ వరకు నడుచుకుంటూ వచ్చాడు అని లామీ ఆ పోస్ట్‌లో చెప్పింది. అంతసేపు నడిచావు కదా.. కాసేపు రెస్ట్ తీసుకోమన్నా అతను తీసుకోలేదని, వెంటనే ఇంట్లో సామాను తరలించే పని మొదలుపెట్టాడని ఆమె తెలిపింది. ఆ పని చేస్తూ చిన్నతనం నుంచీ తాను పడిన కష్టాలను తనకు కార్ వివరించాడని లామీ చెప్పింది.

అతని స్టోరీ తెలుసుకున్న కంపెనీ సీఈవో ల్యూక్ మార్క్‌లిన్.. తమ కొత్త ఉద్యోగి కార్‌ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చాడు. అతనితో కప్పు కాఫీ తాగిన తర్వాత ఓ కొత్త కారును అతనికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతులేని ఆనందంతో తన బాస్‌ను గట్టిగా హత్తుకున్నాడు కార్. ఆ తర్వాత తన స్టోరీని పోస్ట్ చేసిన లామీకి కూడా అతడు కృతజ్ఞతలు చెప్పాడు. గ్రాడ్యుయేషన్ చేయాలని అనుకుంటున్న కార్.. భవిష్యత్తులో యూఎస్ మరైన్స్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


5539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles