అమెరికా పోలీసుల ఓవర్‌యాక్షన్

Fri,September 7, 2018 02:36 PM

blackboy harrassed by police before his white granny

అమెరికా పోలీసులు రంగు కళ్లద్దాల్లోంచి మనుషుల్ని చూడడం ఎప్పుడు మానేస్తారురా బాబూ అనిపించే ఘటన ఇది. మిల్వాకీలో పాలెట్ బార్ అనే ఓ బామ్మ మనుమనితో కారులో వెళ్తున్నది. ఆమె దోస్తు అయిన మరో బామ్మ కూడా ఆ కారులోనే ఉంది. 18 ఏండ్ల మనుమడు అకిల్ కార్టర్ వెనుక సీటులో ఉన్నాడు. అతడు పనిచేసే వైద్యకేంద్రం దగ్గర దిగబెడదామని బామ్మ తీసుకువెళ్తున్నది. ఇక్కడిదాకా కథ మామూలుగానే ఉంది. కానీ అక్కడే పోలీసులు సీన్‌లో ఎంటరయ్యారు. కారును వెంబడించి బలవంతంగా పక్కకు ఆపించారు. తుపాకీ గురిపెట్టి కార్టర్‌ను కిందకు దింపారు. కదిలితే చంపేస్తామని బెదిరించారు. భయంతో వణుకున్న కార్టర్‌ను నేలకు అదిమిపట్టుకుని బేడీలు తగిలించారు. తమ పోలీసుకారులో జాలీల వెనుక కూర్చోబెట్టారు. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే ఇదంతా జరిగిపోయింది. ఈ పోలీసు ఓవర్ యాక్షన్ దేనికటా అంటే బామ్మ శ్వేతజాతీయురాలు, ఆమె దోస్తు కూడా శ్వేతజాతీయురాలే. కానీ మనుమడు కార్టర్ నల్లజాతీయుడు. అక్కడే వచ్చింది చిక్కు. ఓ నల్లజాతి యువకుడు ఇద్దరు శ్వేతజాతీయ మహిళలను కారులో కిడ్నాప్ చేసి తీసుకునిపోతున్నాడని మన కథలోని పోలీసులు ఊహించుకున్నారు. తీరా బామ్మ అసలు సంగతేందో వివరించేసరికి సారీ చెప్పి వెళ్లిపోయారు. నల్లజాతివారి మీద నేరముద్ర వేయడం అమెరికా సమాజానికి పరిపాటి అయిందనడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏంకావాలి. గమ్మత్తయిన సంగతేంటంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఓ శ్వేతజాతీయురాలి నల్లజాతి మనుమడే!

1882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles