ఉల్లిపాయలను తినడం మానేసిన బంగ్లాదేశ్‌ ప్రధాని

Mon,November 18, 2019 11:59 AM

ఢాకా : ఉల్లిపాయ ధరలు భారత్‌లోనే కాదు.. బంగ్లాదేశ్‌లోనూ ఆకాశాన్నంటాయి. ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో.. దాన్ని తినేందుకు కూడా భయపడుతున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉల్లిపాయ ధరలు కొండెక్కుతున్నాయి. భారత్‌లో కురిసిన వర్షాల కారణంగానే ఉల్లిపాయ ధరలు అధికమయ్యాయి. బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయ ధర రూ. 260 పలుకుతోంది. దీంతో ఉల్లిపాయను తినడం మానేశారు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసినా. తమ మెను నుంచి ఉల్లిపాయను తొలగించినట్లు హసీనా డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ హసన్‌ జాహీద్‌ తుషేర్‌ మీడియాకు వెల్లడించారు. ప్రధాని నివాసంలో ఉల్లిపాయతో చేసిన వంటకాలేవి లేవని ఆయన తెలిపారు.


ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం


ఇక భారత్‌లో భారీ వర్షాల వల్ల ఉల్లి కొరత ఏర్పడడం.. ధరలు పెరగడంతో.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి విషయంలో భారత్‌పైనే బంగ్లాదేశ్‌ ఆధారపడుతోంది. భారత్‌ నుంచి బంగ్లాకు ఉల్లి ఎగుమతి లేకపోవడంతో.. టర్కీ, మయన్మార్‌, చైనా, ఈజిప్టుల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. భారత్‌లో కూడా ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది కేంద్రం.

ఉల్లి లేని వంటలే తింటున్నాం


తనకు 41 ఏళ్లు.. ఇన్నేళ్ల కాలంలో ఉల్లి ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి అని శార్మీన్‌ అనే ఓ గృహిణి చెప్పింది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. గత వారం రోజుల నుంచి ఉల్లిపాయ లేని కూరలే తింటున్నామని తెలిపింది. తన భర్త పకోడీ అమ్ముతుంటాడు.. దాన్ని తయారీకి భారీ మొత్తంలో ఉల్లిపాయలు కావాలి. కానీ ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటడంతో పకోడీ తయారు చేయడం మానేశాడు అని శార్మీన్‌ వాపోయింది.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles