ఫ్రాన్స్‌లో క్రిస్మస్ సంతపై కాల్పులు.. ఇద్దరు మృతి

Wed,December 12, 2018 06:07 PM

ARMED MAN OPENS FIRE ON CHRISTMAS MARKET 2 KILLED

ఫ్రాన్స్‌లోని చరిత్రాత్మక స్ట్రాస్‌బోర్గ్ నగరంలో క్రిస్మస్ మార్కెట్‌పై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా 11 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం జనసమ్మర్దం అధికంగా ఉన్న సమయంలో ఓ సాయుధుడు అక్కడికి వచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. సుమారు నలుగురు చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కానీ స్థానిక అధికారులు మాత్రం ఇద్దరే చనిపోయినట్టు ప్రకటించారు. 2015 నుంచి వరుసగా జరుగుతున్న ఒంటరి ఉగ్రదాడుల కారణంగా ఫ్రాన్స్ అప్రమత్తంగా ఉంటున్నది. స్ట్రాస్‌బోర్గ్ క్రిస్మస్ సంతపై దాడి జరిపిన చెకాత్ చెరీఫ్ (29)పై పోలీసు నిఘా ఉంది. అతడు పారిపోయాడా లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అనేది తెలియరాలేదు.

దుకాణాలు మూసి రెస్టారెంట్లలో రద్దీ పెరిగే 8 గంటల ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయి. దాంతో జనాలు భయాందోళనతో రెస్టారెంట్లలోకి పరుగులు తీశారు. వారు లోపలకు చేరుకోగానే రెస్టారెంట్ల యజమానులు భద్రత కోసం ముందరి తలుపులు వేసి లైట్లు ఆర్పివేశారు. దుండగుడిని పోలీసులు చుట్టుముట్టినట్టు ఆపరేషన్‌తో సంబంధం గల అధికారి ఒకరు చెప్పారు. కానీ గంట తర్వాత అతడు తప్పించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దుండగుడు స్థానిక పోలీసులకు తెలిసినవాడేనని, అతనిపై నిఘా కూడా ఉందని అంతరంగిక భద్రతా మంత్రి క్రిస్టాఫ్ కాస్టనర్ చెప్పారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles