అంతర్జాతీయ న్యాయమూర్తులకు అమెరికా బెదిరింపులు

Tue,September 11, 2018 04:58 PM

AMERICA THREATENS ICC JUDGES

అమెరికా తలచుకుంటే బెదిరింపులకు కొదువా అని పాత సామెతలను తిరిగేసి చెప్పుకోవాలేమో. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తన నిర్ణయాలను వ్యతిరేకించిన జడ్జీలను దారుణంగా విమర్శించారు. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీలను టార్గెట్‌గా చేసుకున్నారు. అరెస్టు చేస్తాం, కేసులు వేస్తాం, ఆస్తులు జప్తు చేస్తామంటూ కస్సుబుస్సులకు దిగారు. ఎందుకంటా అంటే.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన యుద్ధనేరాల కేసు విచారణ చేపట్టారు. ఆ కేసులో అమెరికా సైనికాధికారులపై ఆరోపణలు ఖరారు చేస్తే ఊరుకునేది లేదని ఆయన మండిపడుతున్నారు. వారు ఏదేశ పౌరులైనా అమెరికాలోకి అడుగుపెడితే అరెస్టు చేస్తారట.

అంతర్జాతీయ కోర్టుకు అమెరికా జవాబుదారీ కాదని, అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలకు ఆ కోర్టు ప్రమాదకరమని అన్నారు. ఆఫ్ఘన్‌లో పనిచేసిన అమెరికా సైనికాధికారులను విచారించాలనుకోవడం అసంబద్ధమని, సమర్థనీయం కాదని పేర్కొన్నారు. కోర్టు మావైపు వస్తే మేం చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. అంతర్జాతీయ కోర్టు అధికారులపై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, నేరారోపణలు చేస్తామని బోల్టన్ చెప్పారు. ఆ కోర్టు జడ్జీలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధిస్తామని, అమెరికా చట్టాల ప్రకారం వారిపై విచారణ జరుపుతామని అన్నారు. కోర్టుకు సహకరించే కంపెనీ, లేదా దేశంపై కూడా అలాంటి చర్యలే తీసుకుంటామని చెప్పారు. పలుకుబడి కలిగిన ఫెడరలిస్టు సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక, గూఢచార అధికారులపై విచారను పునఃప్రారంభించాలని గత ఏడాది ఓ ప్రాసిక్యూటర్ దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్ఘన్ లేదా మరే దేశం ఈ దర్యాప్తును కోరలేదని బోల్టన్ నొక్కిచెప్తున్నారు. కానీ ఏరోజైనా అంతర్జాతీయ న్యాయస్థానం దర్యాప్తును తిరిగి అనుమతించే అవకాశముందని ఆయన అక్కసు. చట్టబద్ధత లేని ఈ కోర్టు అమెరికా లేదా దాని మిత్రదేశాలకు చెందినవారిపై ఎలాంటి దర్యాప్తునకు ప్రయత్నించినా అమెరికా తన ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశారు. మేం అంతర్జాతీయ న్యాయస్థానానికి సహకరించం. ఎలాంటి సహాయం అందించం. ఆ కోర్టులో చేరం. అది తనంతట తానుగా అంతమైపోవాలని కోరుకుంటున్నాం.. అని ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు అమెరికా సార్వభౌమత్వంపై మరే సంస్థ అధికారాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని అన్నారు.

460
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS