
ఆన్లైన్ అమ్మకాల అంగడి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇటీవలే ప్రపంచంలోని బిలియనీర్లలో టాపర్‌గా నిలిచారు. మరి ఈ అపర కుబేరుడు ప్రస్తుతం డబ్బులు ఎడాపెడా వెదజల్లుతున్నారట. ఎందుకూ అంటే.. ఏమో రాకెట్ ఎగరావచ్చు అంటున్నారు. అమెజాన్‌తో పాటుగా ఈయనకు బ్లూ ఆరిజిన్ అనే ఓ ప్రైవేటు అంతరిక్ష కంపెనీ ఉంది. రాకెట్ ప్రయోగాల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం స్టార్టప్ మోడ్ నుంచి ఉత్పత్తి మోడ్‌లోకి మారుస్తున్నారు. స్పీడ్ పెంచేందుకు అవసరమైన డబ్బూ, ఇంజినీర్లను భారీగా సమకూరుస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ న్యూగ్లెన్ అనే భారీ రాకెట్‌ను తయారుచేసే పనిలో ఉంది.
బోలెడన్ని ఉపగ్రహాలను, మనుషులను ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపే సామర్థ్యం దీనికి ఉంటుందట. వాణిజ్య, సైనిక ఆర్డర్లు కుప్పతెప్పలుగా వచ్చి పడతాయనే ఆశతో బెజోస్ ఈ రాకెట్ కార్యక్రమంలో డబ్బులు అదేపనిగా గుమ్మరిస్తున్నారు. మొదటిదశ బూస్టర్‌ను మళ్లీమళ్లీ ఉపయోగించడం ఈ రాకెట్ ప్రత్యేకత. ఈ ప్రయోగం సఫలమైతే ఇక బెజోస్‌కు తిరుగుండదు. కంపెనీలు, ప్రభుత్వాలు ఆయన ఇంటిముందు క్యూ కడతాయి. అయినా ఎంత మనీ, మార్బలం పోస్తే ఏం లాభం? అనుకున్న సమయానికి.. అంటే 2020 నాటికి రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం కావడం అనుమానమేనని అంటున్నారు. పోరగాండ్లను పెట్టి అమెజాన్ పార్సిల్‌ను ఆగమేఘాల మీద కస్టమర్లకు చేరవేయడం వేరు, అంతరిక్షంలోకి రాకెట్ చేరవేయడం వేరు అని ఈ రంగంలోని నిపుణులు పెదవి విరుస్తున్నారు. మరి రాకెట్ ప్రోగ్రాం అంటే మాటలా?