లండన్‌లో... ఆదిలాబాద్ కళాకారిణుల నృత్యాలు..!

Mon,November 5, 2018 09:43 PM

-ఆకట్టుకుంటున్న నృత్యరూపకాలు, ప్రదర్శనలు
-లండన్ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

లండన్: జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్(లండన్) ఆధ్వర్యంలో లండన్‌లోని పలు ప్రదేశాల్లో ఆదిలాబాద్ నృత్య కళాకారిణుల ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకుంటున్నాయి. ఆచార్య వైభవ యాత్రలో భాగంగా రూపాంజలి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిలు తమ నృత్యాలతో, నృత్య రూపకాలతో లండన్ ప్రజలను అలరిస్తున్నారు. ఆదివారం రాత్రి స్ట్రాట్‌ఫోర్డ్ సర్కస్ ఆర్ట్స్ సెంటర్‌లో రూపాంజలి కార్యక్రమంలో భాగంగా ఆచార్య త్రయము నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యరూపక కార్యక్రమం ఆహూతుల నుంచి హర్షధ్వానాలను రాబట్టింది. ఈ నృత్యరూపకం ఇప్పటి వరకు 108 సార్లు ప్రదర్శించారు. భరత నాట్య శైలిలో ఉండే ఈ నృత్య రూపకం కార్యక్రమానికి హాజరైన తెలుగు ప్రజలు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు, బ్రిటన్ పౌరులు మంత్రమగ్ధులయ్యారు. ఈ నెల 7న నార్త్ ఈస్ట్ హ్యామ్ లండన్‌లోని శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో, ఈనెల 10న ఛెమ్స్‌ఫోర్డ్‌లోని ది క్వాకర్స్ మీటింగ్ హౌజ్‌లోనూ వీళ్లు నృత్యప్రదర్శనలు చేయనున్నారు.

జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్(లండన్) ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఉత్సవాల్లో ఈసారి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ భరతనాట్య శిక్షకురాలు సముద్రాల మాధవీ రామానుజం ఆధ్వర్యంలో కళాకారిణుల బృందం బ్రిటన్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలోని సభ్యులందరూ ఆదిలాబాద వారే కావడం గమనార్హం. దివాళీ ఎట్ లండన్ కార్యక్రమాన్ని లండన్ స్క్వేర్ తో పాటు ఇప్పటి వరకు మూడు ప్రదర్శనలు ఇచ్చిన ఆదిలాబాద్‌కు చెందిన నృత్యకళాకారిణుల బృందం మరికొన్ని ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన ఆచార్య త్రయముతో పాటు రామానుజ దివాకర, యతిపతి జైత్రయాత్ర, సమతామూర్తి శ్రీరామానుజులు తదితర నృత్య రూపకములను ప్రదర్శిస్తూ ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణ కీర్తిని చాటుతున్నారు. ఈ బృందంలోని దివ్య నాట్యంలో శిక్షణ అందిస్తుండగా... అనూష టాటా టెలీ సర్వీసెస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నది. ప్రహర్ష యెనగంటి వరంగల్‌లోని కేఎంసీలో మెడిసిన్ చదువుతోంది. తనిష్క, అనుష్క పదో తరగతి చదువుతున్నారు. ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన, గిరిజన ప్రాంతం నుంచి లండన్‌కు వచ్చి ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ కీర్తిని దశదిశలా చాటుతున్న కళాకారిణులపై అక్కడి తెలుగు వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.


1214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles