ఆ కథంతా పెద్ద డ్రామా.. అనాథ పేరు చెప్పి భారీ దోపిడీ!

Fri,November 16, 2018 12:35 PM

Act of kindness that raised 4 lakh dollars is a lie

న్యూయార్క్: ఏడాది కిందట కేట్‌లిన్ మెక్‌క్లూర్ అనే మహిళ ఓ ఇల్లు లేని వ్యక్తి కోసం విరాళాలు సేకరిస్తున్నదంటూ ఓ వార్త వచ్చిన సంగతి తెలుసు కదా. ఫిలడెల్ఫియా సమీపంలో తన కారు ఆగిపోవడంతో ఓ ఇల్లు లేని వ్యక్తి తన దగ్గర ఉన్న చివరి 20 డాలర్లతో కారుకు ఇంధనం కొట్టించి తనను ఆదుకున్నాడని, దీనికి ప్రతిగా తాను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నట్లు ఆ మహిళ చెప్పింది. దీనికోసం గోఫండ్‌మీ ద్వారా సుమారు 4 లక్షల డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) సేకరించింది. అయితే అదంతా పెద్ద మోసం అని ఇప్పుడు తేలింది. ఈ నాటకానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై న్యూజెర్సీ కోర్టులో కేసు నడుస్తున్నది. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గోఫండ్‌మీలో వెల్లడించి మెక్‌క్లూర్ క్రౌడ్ ఫండింగ్ కోరింది. మొదట పది వేల డాలర్లు సేకరించాలని గోఫండ్‌మీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వెంటనే అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఓ మంచి పని కోసం మెక్‌క్లూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ మార్క్ డీఅమికో ఈ పని చేస్తున్నారని భావించి చాలా మంది భారీగా విరాళాలు ఇచ్చారు.

అయితే సదరు ఇల్లు లేని బాబిట్ అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయమంతా బయటపడింది. వాళ్లు తనకు కేవలం 75 వేల డాలర్లు మాత్రమే ఇచ్చి.. మిగతా సొమ్ముతో టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని, ఈ మధ్యే ఓ బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నారని బాబిట్ ఆరోపించాడు. దీనిపై విచారణ జరపగా.. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ పెద్ద డ్రామా అని తేలింది. బాబిట్ కూడా ఆ జంటతో కలిసి కుట్రలో భాగమయ్యాడని విచారణలో స్పష్టమైంది. ఈ విరాళాల సేకరణ అంతా పెద్ద మోసం అని బుర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ స్కాట్ కొఫినా మీడియాకు వెల్లడించారు. గోఫండ్‌మీ ప్రచారం మొదలైన గంట తర్వాత మెక్‌క్లూర్ తన ఫ్రెండ్‌కు ఓ మెసేజ్ పంపించింది. ఈ స్టోరీ అంతా పూర్తిగా కల్పితం అని ఆ మెసేజ్‌లో ఆమె చెప్పింది అని కొఫినా తెలిపారు. ఆమె కారులో ఇంధన అయిపోలేదు. సదరు బాబిట్ తన దగ్గరున్న 20 డాలర్లు ఇవ్వలేదు అని ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ ముగ్గురూ కలిసి ఈ కథంతా అల్లి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ ముగ్గురిపై కుట్ర కేసు నమోదు చేశారు. మరోవైపు 4 లక్షల డాలర్ల వరకు విరాళాలు ఇచ్చిన మొత్తం 14 వేల మందికి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి గోఫండ్‌మీ సిద్ధమవుతున్నది.

2864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles