400 ఏళ్ల కిందటి చెట్టును దొంగిలించారు.. ఓనర్ ఏమన్నదో తెలుసా?

Tue,February 12, 2019 09:53 AM

400 year old Bonsai Tree stolen in Tokyo

టోక్యో: బోన్సాయ్ చెట్టు తెలుసు కదా. ఇదో మరుగుజ్జు చెట్టు. వందల ఏళ్ల కిందటి చెట్టు కూడా రెండు నుంచి ఆరు అంగుళాల కంటే ఎక్కువ పెరగదు. చూడటానికి కూడా ఎంతో ముద్దుగా, అందంగా ఉంటుంది. అయితే ఇవి ఎంత బాగుంటాయో.. వీటి బాగోగులు చూడటం అంత కష్టంగా ఉంటుంది. జపాన్‌లో ఎక్కువగా కనిపించే ఈ అందమైన చెట్లను అక్కడి వాళ్లు ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. ఫుయుమి ఐమురా అనే వ్యక్తి కూడా తన ఇంట్లో ఈ చెట్లను పెంచుతున్నది. అందులో నాలుగు వందల ఏళ్ల కిందటి బోన్సాయ్ కూడా ఉంది. ఈ అరుదైన చెట్టును ఈ మధ్యే ఎవరో దొంగిలించారు. అయితే దొంగిలిస్తే దొంగిలించారుగానీ.. దానిని బాగా చూసుకోండి.. నీళ్లు పోయండి అని ఐమురా ఫేస్‌బుక్ పోస్ట్‌లో కోరింది. ఓ చిన్నారిని కోల్పోయినంత బాధ కలుగుతున్నదని ఆమె చెప్పింది. ఆ చెట్టును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది చనిపోతుందని, వందల సంవత్సరాల శ్రమ వృథా అవుతుందని ఐమురా బాధపడుతున్నది.

ఆ బోన్సాయ్‌ను ఎవరు తీసుకెళ్లినా సరే.. దానికి నీళ్లు పోయండి. అది 400 ఏళ్లుగా బతికే ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారం రోజులు నీళ్లు లేకపోతే చనిపోతుంది అని ఐమురా ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌లో చెప్పింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పటికీ బతికే ఉంటాయని, మనం చనిపోయినా అవి మాత్రం అలా మనుగడ సాగిస్తూనే ఉంటాయని ఆమె అంటున్నది. దొంగలు ఈ బోన్సాయ్‌తోపాటు మొత్తం ఏడు చెట్లను దొంగిలించారు. వాటి విలువ లక్షా 18 వేల డాలర్లుగా లెక్క కట్టారు. మార్కెట్‌లో వీటి విలువ ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చెట్లను పిల్లల్లాగా చూస్తాం. మా బాధ చెప్పడానికి మాటలు రావడం లేదు అని ఐమురా ఆవేదన చెందుతున్నది. ఐమురా భర్త సీజీ ఐమురా తరతరాలుగా ఈ బోన్సాయ్ చెట్ల బాగోగులు చూస్తున్నది. 1868 నుంచి ఈ కుటుంబం ఇదే పనిగా పెట్టుకున్నది.

6444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles