వడదెబ్బ నుంచి త‌ప్పించుకోండిలా..!

Tue,April 24, 2018 04:04 PM

sun stroke symptoms safety precautions and tips

ఎండలు భగ భగ మండుతున్నాయి. గడప దాటితే చాలు ఎండ తీవ్రతకు శరీరం మొత్తం ఫ్రై చేసినట్లుగా అయిపోతోంది. దేహంలోని నీరంతా ఇంకిపోయి నిస్సత్తువ ఆవహిస్తోంది. ఎండలో మరింత ఎక్కువగా తిరిగితే చాలు వడదెబ్బ తగులుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వడదెబ్బకు ముందు.. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వడదెబ్బ లక్షణాలు...

మూత్రం పచ్చగా వస్తుంటుంది. నిస్సత్తువ, నీరసం, బరువు తగ్గడం, తలనొప్పి, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు పట్టేస్తాయి. కళ్లు బైర్లు కమ్ముతాయి. నాలుక పిడచకట్టుకు పోతుంది. కొంత మందికి విపరీతంగా జ్వరం వచ్చి, సొమ్మసిల్లి పడిపోతుంటారు. కొందరికి ఫిట్స్‌ రావచ్చు.. కోమాలోకి వెళ్ల‌వచ్చు. ఇలాంటివారిని తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.

వడదెబ్బ తగిలితే...

వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లగా ఉండే నీడపట్టుకు చేర్చాలి. గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పడుకోపెట్టాలి. చల్లటి దుస్తులు కప్పాలి. శరీరం వేడిగా ఉంటే తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. ఉప్పు, చ‌క్కెర కలిపిన నీటిని గంట గంటకూ తాగించాలి. కొందరికి వడదెబ్బ తగిలినప్పటికీ చెమట రాదు. ఇటువంటి వారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. వాంతులు, విరేచనాలు అవుతున్నా వీలైనంత నీటిని తాగుతునే ఉండాలి

ఇలా చేస్తే మేలు...

1. ఉదయం గం. 9 నుంచి సాయంత్రం గం. 5 వరకు బయటకు వెళ్లక పోవడం మంచిది. ఏవైనా పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లోనే చేసుకోవాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే నీడ పట్టునే సాగాలి.
2. ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్లు అరగంటకు ఓసారైనా కొంత‌సేపు నీడలో గ‌డ‌పాలి. బయటకు వేళ్లేవారు ముందుగా వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి. ఎండకు రక్షణగా గొడుగు, టోపీలు, హెల్మెట్‌ ధరించడం మంచిది.
3. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులనే ధరించాలి. ఉద్యోగులైన భార్యాభర్తలు ఇళ్లలోనే ఉండే వృద్ధులు, చిన్నారులకు నీటిని అందుబాటులో ఉంచాలి.
4. మూత్రం పచ్చరంగు నుంచి సాధారణ రంగుకు మారే వరకూ నీటిని తాగుతునే ఉండాలి. మద్యం, కాఫీ, టీ, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌, స్పైసీఫుడ్‌లకు దూరంగా ఉండాలి.
5. ఉప్పు కలిపిన మజ్జిగ/నిమ్మరసం/కొబ్బరినీళ్లు/రాగి అంబలి నిత్యం తాగడం మంచిది. వేస‌విలో ఇవి శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఎండ దెబ్బ బారి నుంచి ర‌క్షిస్తాయి.
6. కీర దోస, పుచ్చకాయ‌ తినడం లేదా వాటితో తయారు చేసిన జ్యూస్‌లు తాగాలి. బయటి నుంచి ఇంటికి రాగానే చన్నీళ్లతో స్నానం చేయాలి. స్నానం వీలు కాకుంటే ముఖం, కాళ్లు, చేతులను చల్లటి నీటితో కడుక్కోవాలి.
7. వీలైనన్ని సార్లు నీటిని తాగుతునే ఉండాలి. ప్రిజ్‌ నీరు, ఐస్‌ క్యూబ్‌లు వేసిన నీటికి బదులు పరిశుభ్రమైన కుండ నీరు తాగితే మంచిది. బయటి నుంచి రాగానే నిమ్మకాయ రసంలో కొద్దిగా చ‌క్కెర‌, ఉప్పు వేసుకుని తాగాలి. నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా చ‌క్కెర కలిపిన మిశ్రమాన్ని కూడా సేవించవచ్చు.

ఇలా చేయకండి...

1. రోడ్డు మీద అమ్మే ఆహార పదార్థాలు తినవద్దు. అపరిశుభ్రమైన నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండండి. కలుషితమైన నీటి వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా చేరి డయేరియా రావచ్చు.
2. మాంసం, గుడ్డు, నూనె తదితర పదార్థాల జోలికి వెళ్లొద్దు. పాచిపోయిన అన్నం తినవద్దు. వేడిగా, తాజాగా ఉండే ఆహారాన్నే తీసుకోండి.
3. ఒళ్లు వేడిగా ఉన్నా, వాంతులు విరేచనాలైనా, గొంతు నొప్పి అనిపించినా తక్షణమే వైద్యుణ్ణి సంప్రదించాలి. జ్వరం వచ్చి తగ్గుతుంటే డాక్టర్ల సలహా మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. అంటు వ్యాధులు సోకిన వారికి దూరంగా ఉండాలి.
4. ఫ్రిజ్‌లలో రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకండి.
5. శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ ఉంటే సాధారణంగా భావిస్తారు. అది 100 డిగ్రీలు ఉంటే స్వల్ప జ్వరమ‌ని, 102 డిగ్రీలు దాటితే సాధారణ జ్వరమ‌ని, 104 డిగ్రీలు ఉంటే తీవ్ర జ్వరమ‌ని, శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉంటే అతి ప్రమాదకరమైన జ్వరంగా ప‌రిగ‌ణిస్తారు. క‌నుక జ్వ‌రం తీవ్ర‌త‌ను బ‌ట్టి ముందుగానే స్పందించి డాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తే ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

2827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles