హైదరాబాద్: టెస్లా కార్ల కోసం ఇండియా ఎంతగా ఎదురు చూస్తున్నదో ఇండియాలో అడుగు పెట్టేందుకు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సైతం అంతే ఉత్సుకతతో ఉంది. భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇంకా శైశవదశలోనే ఉంది. అయితే టెస్లా అడుగుపెట్టిన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని పరిశీలకులు అంటున్నారు. కాకపోతే తొలిదశలో టెస్లా కార్ల షోరూములు ప్రారంభించే నగరాల్లో హైదరాబాద్ లేనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఇండియాలో తొలిదశలో కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోనే టెస్లా కార్ల షోరూములు వస్తాయి. ఆ మూడు మెట్రో నగరాల్లో టెస్లా షోరూము స్థలాల కోసం ఎంక్వయిరీలు చేస్తున్నట్టు సమాచారం. సాధారణ కార్ల షోరూముల్లా కాకుండా ఎక్కువ వైశాల్యం కలిగిన అంటే సుమారు 20 నుంచి 30 వేల చదరపు అడుగుల స్థలాల కోసం టెస్లా ప్రస్తుతం అన్వేషిస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అయిన్ టెస్లా భారత మార్కెట్ కోసం ఎంట్రీ లెవల్, చవకైన కార్లను కూడా ప్లాన్ చేస్తున్నదని అంటున్నారు. కొత్త మార్కెట్ల కోసం చవక కార్లను తయారు చేస్తామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇదివరకే ప్రకటించారు.