e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఆరోగ్యం కరోనా వేళ యోగా మేలు..

కరోనా వేళ యోగా మేలు..

కరోనా వేళ యోగా మేలు..
 • ఒత్తిడి నివారణకు దివ్య ఔషధం
 • మానసిక సంఘర్షణకు అడ్డుకట్ట
 • అదుపులోకి ఆలోచనలు, మనసు, ఏకాగ్రత
 • ఆక్సిజన్‌ శాతం పెరుగుదల
 • ఆసనాలతో సాఫీగా ఊపిరితిత్తుల ప్రక్రియ
 • శ్వాసక్రియ రేటు పెరుగుదలకు దోహదం

కరోనా పంజా విసురుతున్న వేళ ఇప్పుడు ప్రతిఒక్కరూ మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఎక్కడికెళ్లినా, ఏది ముట్ట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా వైరస్‌ సోకుతుందేమోనని భయపడిపోతున్నారు. శరీరంలో ఏ మాత్రం తేడా కనిపించినా కరోనానేమోనని ఆందోళన చెందుతున్నారు. శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా కుంగిపోతూ అనారోగ్యం బారినపడుతున్నారు. వైరస్‌ సోకడం కంటే.. దాని ఒత్తిడి వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు, వైద్యులు తెలుపుతుండడం శోచనీయం. ఒత్తిడి నివారణకు నిత్యం క్రమం తప్పకుండా యోగా చేయడం మేలని, ఫలితంగా ప్రశాంత జీవనం సాగించడంతోపాటు కరోనా వల్ల వాటిల్లుతున్న శ్వాసకోశ ఇబ్బందులను అధిగమించొచ్చని సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు. అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నిలబడడం, శ్రమను, ఒత్తిడిని తట్టుకొనే శక్తిని, మేధో పరిపక్వతను సాధించడం. కోపం, ప్రేమ, నవ్వు తదితర భావాలను అదుపులో పెట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. వాటిలో ఏ ఒక్కటి అదుపు తప్పినా అది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. మానవుడిని ఒత్తిడిలోకి తోసి శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి అధోపాతాళానికి తోస్తుంది. చివరకు అది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. ప్రస్తుతం యావత్‌ సమాజం ఇలాంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నది. ప్రతి ఒక్కరూ కరోనా విలయతాండవానికి బిక్కుబిక్కుమంటున్నారు. వైరస్‌ సోకడం కంటే.. దాని ఒత్తిడి వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు, వైద్యులు తెలుపుతుండడం శోచనీయం. ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా జీవనం సాగించడంతో పాటు, ప్రస్తుతం కరోనా వల్ల వాటిల్లుతున్న శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే కొన్న ప్రత్యేక ఆసనాలపై ప్రత్యేక కథనం..

పూర్వోత్తానాసనం..

ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి, రెండు చేతులను శరీరానికి ఇరుపక్కల పెట్టుకొని దండాసనం వేయాలి. అరచేతులను భుజాల కింద పెట్టి తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ నడుమును పైకి లేపాలి. పాదాలను సమాంతరంగా పెడుతూ, కాలి వేళ్లు భూమిని తాకించేందుకు ప్రయత్నించాలి. ఈ ఆసనం గుండెకు, ఊపిరితిత్తుల పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాదు చేతులు, పాదాలను దృఢంగా మార్చుతుంది.

శ్వాసతో ధ్యానం

వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోవాలి. రెండు నాసికాపుటాలను రాపిడికి గురిచేస్తూ వేగంగా గాలిని పీల్చుకోవాలి. ఉండగలిగినంత సేపు ఉండి తరువాత నెమ్మదిగా అదే రాపిడిని కలుగజేస్తూ గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులను చేరడానికి ముందే గాలి వేడెక్కుతుంది. ఫలితంగా శరీరశుద్ధి వేగవంతమవుతుంది. జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులు తొలగుతాయి. గురక కూడా తగ్గడమేగాక, శరీరంలోని విషమలినాలన్నింటినీ బయటకు పంపుతుంది. అంతేకాదు ప్రతికూల ఆలోచనలను తగ్గించి మెదడులో అయోమయ ఆలోచనలు లేకుండా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

వజ్రాసనం

ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. తరువాత ఒక్కో కాలిని మడచి వెనక్కి తీసుకుంటూ జఘన కిందిభాగంలో ఉంచుకోవాలి. రెండు కాలిబోటనవేళ్లను ఒకదానిమీద ఒకటి పెట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా చేసి, రెండు చేతులను మోకాళ్లపై పెట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకోవాలి.

పరిపూర్ణ శుప్త వజ్రాసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. పాదాల వేళ్లను దగ్గరగా పెట్టి, మడమలను దూరంగా పెట్టాలి. తర్వాత మెల్లగా శరీరాన్ని వెనక్కి వంచి తలను నేలకు ఆనించాలి. రెండు మోచేతులను శరీరం పక్కగా పెట్టుకోవాలి. తర్వాత తలను నేలకు అనించి శరీరాన్ని పైకి లేపాలి. నిదానంగా శ్వాస తీసుకోవాలి. అలా ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.

శుప్త వజ్రాసనం

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. పాదాల వేళ్లను దగ్గరగా పెట్టి, మడమలను మాత్రం దూరంగా పెట్టాలి. తరువాత మెల్లగా శరీరాన్ని వెనక్కి వంచి తలను నేలకు ఆనించాలి. రెండు చేతులను కాళ్లమీద పెట్టుకోవాలి. అలా ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.

లాభాలు..

 • మూడు ఆసనాలు ఊపిరితిత్తులు, పక్కటెముకలకు మంచిశక్తిని ఇస్తుంది. రిబ్‌ కేజ్‌ను ఓపెన్‌ చేసేందుకు పరిపూర్ణ శుప్తవజ్రాసనం ఎంతో ఉపయోగడుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
 • శరీరానికి అందే ఆక్సిజన్‌ పరిమాణాన్ని పెంచుతాయి. ఉదాహరణకు ఆక్సిజన్‌ లెవల్స్‌ 70 శాతం ఉన్న ఈ ఆసనాలను చేయడం వల్ల 90శాతానికి మించి లెవల్స్‌ను పెంచుకోవచ్చు.
 • ఆస్తమా ఉన్నవారికి ఈ ఆసనాలు ఎంతోమేలు చేస్తాయి.
 • చేతుల, పాదాలను దృఢంగా మార్చుతుంది. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి.
 • శ్వాసక్రియ రేటును మెరుగుపరచి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

మెడీ బ్రీతింగ్‌

గాలి పీల్చుకునేదానిపై అంటే ఉచ్వాస, నిశ్వాస ప్రక్రియలపై దృష్టిసారించడమే ఈ ఆసనం ప్రత్యేకత. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఊపిరిని దీర్ఘంగా వదలాలి. తర్వాత చేతి బొటనవేలుతో ఒక ముక్కురంధ్రాన్ని మూసివేసి మరో నాసిక ద్వారా ఊపిరిని గట్టిగా పీల్చాలి. ఆ తర్వాత తలను మెల్లగా పైకెత్తాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో గాలిని లోపలికి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని క్షణాలపాటు అలాగే ఉండి, తరువాత తలను కిందకు వంచి అంతే నెమ్మదిగా ఊపిరిని వదలాలి. ఇలా సుమారు 10 నుంచి 15 సార్లు చేయాలి. దీనివల్ల ఏకాగ్రత శ్వాసమీదనే కేంద్రీకృతమవుతుంది. ఫలితంగా మెదడు విశ్రాంతి తీసుకొని మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

సహజ సమాధి ప్రక్రియ

 • ఇక ఒత్తిడిని జయించేందుకు ప్రాచీనకాలం నుంచి వస్తున్న మరో ప్రక్రియ సహజ సమాధి స్థితి.
 • ఇందులో ప్రధానంగా నిద్రపోకుండా ఉంటూనే, మనసును ప్రగాఢమైన విశ్రాంతిలోకి తీసుకెళ్లడమే దీని ప్రత్యేకత.
 • తద్వారా మనసును సమతాస్థితిలో ఉంచగలగడం ద్వారా ఒత్తిడిని జయించొచ్చు.

సర్పాసనం

 • ముందుగా బోర్లా పడుకోవాలి.
 • చాతి పక్కగా రెండు చేతులను పెట్టుకోవాలి.
 • తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ అరచేతులపై, పాదాల వేళ్ల మీదనే శరీరాన్ని మీదకు లేపాలి.
 • మెల్లగా గాలి వదులుతూ తలను కుడిభుజం మీదుగా వెనక్కి తిప్పి కాలి మడమలను చూసేందుకు యత్నించాలి.
 • మళ్లీ గాలి పీల్చుతూ తలను ముందుకు తీసుకురాలి.
 • ఇదే ప్రక్రియను ఎడుమ భుజం మీదుగా కూడా చేయాలి.
 • ఈ ఆసనం ఊపిరితిత్తులను పూర్తిసామర్థ్యంతో పనిచేసేలా చేస్తాయి.
 • ఫలితంగా శరీరానికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ అందుతుంది.
 • ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

మరికొన్ని క్రియలు

 • మెడనొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నుపూస నొప్పులు, గుండెజబ్బులు తదితర వాటితో బాధపడుతున్నవారు ఆసనాలను వేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
 • అయితే ఎలాంటి శారీరక ఒత్తిడి కలుగకుండా కూడా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ లెవల్స్‌ను పెంచుకునేందుకు పలు చిట్కాలు ఉన్నాయి.
 • నిద్రపోవడం, కూర్చునే విధానంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు.
 • ఒకే పక్కన ఎక్కువసేపు పడుకోకుండా ప్రతి అరగంటకు ఒకసారి పొజిషన్‌ మార్చాలని వివరిస్తున్నారు.
 • కుడిభుజం వైపు, ఎడమభుజం వైపు, బోర్లా పడుకోవడం, వెల్లకిలా పడుకోవడం చేయడం ద్వారా అన్ని శరీరభాగాలకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుందని తెలుపుతున్నారు.

మే 7 నుంచి ఉచిత యోగా శిబిరం

మానసిక ప్రశాంతతకు ధ్యానం ఔషధం వంటిది. మనం రోజూ చేసే పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలంటే ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అందులో అనేకరకాల పద్ధతులున్నాయి. యోగాలో సుదర్శన ప్రక్రియ ఉంది. సహజ సమాధి పద్ధతి కూడా ఉంది. ఇవి రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసేందుకు ఎంతో దోహదం చేస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో మే 7-9 వరకు గ్లోబల్‌ సహజ పేరిట ఉచిత యోగాను నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు 098494 72480 నంబర్‌ను సంప్రదించొచ్చు. – భానుమతి నర్సింహన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా వేళ యోగా మేలు..

ట్రెండింగ్‌

Advertisement