e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home హైదరాబాద్‌ మత్స్యావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు

  • మూడోరోజు భక్తులను అలరించిన అలంకారసేవ
  • శేషవాహనమెక్కి భక్తులకు చేరువైన దేవుడు
  • నేడు శ్రీ కృష్ణుడిగా దర్శనం

యాదాద్రి శ్రీ లక్షీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు.. వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు ధరించిన మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. నిత్యపూజలు అందుకున్న తర్వాత సాయంత్రం ఆదిశేష వాహనంపై ఊరేగి భక్తులకు చేరువయ్యాడు. 

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన బుధవారం నాడు స్వామి ఆది అవతారమైన మత్స్యాలంకారంలో దర్శనమిచ్చాడు. సాయంత్రం శేష వాహనమేగి భక్తులను ఆశీర్వదించాడు.  నిత్యపూజల అనంతరం స్వామివారికి మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు వైభవంగా జరిపారు. గోవింద నామ స్మరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య అర్చకబృందం నిత్యపూజలు, అలంకార సేవలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్‌. గీత, అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్‌ ఉభయ వేదాంత శేషం ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

ఆదిశేషుడిపై ఊరేగి

- Advertisement -

బుధవారం రాత్రి స్వామివారికి శేష వాహన సేవ నిర్వహించారు. నిత్యహోమం, చతుస్థానార్చనలు నిర్వహించిన అనంతరం లక్ష్మీనారసింహుడు ఆదిశేషుడిని అధిరోహించి ఊరేగాడు. శేషారూఢుడై భక్తుల వద్దకు చేరుకొని వారికి దర్శనభాగ్యం కల్పించాడు. శేష శయనుడైన నరసింహుడి దర్శనం సర్వాభీష్ట ప్రదాయకమని ఆళ్వారులు ప్రస్తుతిస్తుంటారు. సర్వేశ్వరుడికి గొడుగుగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా వివిధ రీతుల్లో సేవలందించే ఆదిశేషుడు ఆయనకు అపర భక్తుడై నిలిచాడు. అందువల్లే శేషవాహనానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

మత్స్యావతార అలంకార సేవ..

మహావిష్ణువు అవతారాలు వెలసి ఉన్న అన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఓ అలంకార సేవ ఉంటుంది. వేడుకలు ముగిసే వరకు ఒక్కో రోజు ఒక్కో దశావతార రూపంలో అలంకరించడం సంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీ నరసింహుడు బుధవారం మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. దశావతారాల పురాణాలు ప్రవచిస్తు న్నట్టుగా.. కల్పాంత సమయంలో బ్రహ్మ నిద్రించినప్పుడు జగత్‌ ప్రళయం సంభవించింది. ఆ సమయంలో హయగ్రీవుడనే రాక్షసుడు  వేదాలను అపహరించాడు. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి హయగ్రీవుడిని సంహరించి వేదములను తిరిగి బ్రహ్మవశం చేశాడు. అందుకే దశావతారములలో మొదటిదైన ఈ మత్స్యావతారం విశిష్టత సంతరించుకున్నది. వేద పండితులు విష్ణు సూక్తం. నారాయణ సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం పారాయణ చేస్తుండగా శ్రీ నరసింహుడు మత్స్యాలంకారంలో ఊరేగి భక్తులకు కనువిందు చేశాడు. 

దశావతార విగ్రహాలకు పూజలు

ఆలయ పునర్నిర్మాణంలో రెండో ప్రాకారంలోని సాలహారాల్లో నెలవయ్యేందుకు తీర్చిదిద్దిన దశావతార విగ్రహాలకు బుధవారం పూజలు నిర్వహించారు. సాలహారాల్లో వాటిని ప్రతిష్టించేముందు స్థపతి, ఉప స్థపతులు విగ్రహాలను శాస్ర్తోక్తంగా అర్చించారు. లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు మత్స్యావతారం ధరించినప్పుడే మత్స్యావతారం మొదలుకొని దశావతారాల్లో ఉన్న సాల విగ్రహాలకు పూజలు జరగడం కాకతాళీయమని, భగవంతుని కృపకు నిదర్శనమని స్థపతి సలహాదారుడు ఆనందాచార్యుల వేలు అభివర్ణించారు. 

నేడు శ్రీ కృష్ణుడిగా

బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారు కృష్ణుడిగా భక్తులకు దర్శమనిస్తాడు. వేద పారాయణం నిర్వహిస్తారు. రాత్రి హంస వాహనంపై స్వామివారి సేవా కార్యక్రమం జరుగనుంది.

22 రోజుల హుండీ.. 90 లక్షలు 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ 22 రోజుల ఆదాయం రూ.90లక్షలు దాటిందని, ఖజానాకు రూ.5,54,940 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. బుధవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్‌లో హుండీలను లెక్కించామని, నగదు రూ.90,93,534 ఆదాయం వచ్చిందని చెప్పారు. 34 గ్రాముల 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 200 గ్రాముల 500 మిల్లీ గ్రాముల మిశ్రమ వెండి భక్తులు సమర్పించారని వెల్లడించారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.37,724, రూ.100 దర్శనాలతో రూ.13,300, సుప్రభాతంతో రూ.500, క్యారీబ్యాగులతో రూ.1,650, సత్యనారాయణ వ్రతాలతో రూ. 28,500, కల్యాణకట్టతో రూ.13,800, ప్రసాద విక్రయాలతో రూ.3,15,310, శాశ్వతపూజలతో రూ.10,116, వాహన పూజలతో రూ.3,900, టోల్‌గేట్‌ ద్వారా రూ.500, అన్నదాన విరాళంతో రూ.11,632, సువర్ణ పుష్పార్చనతో రూ.59,428, యాదరుషి నిలయంతో రూ.43,740, పుష్కరిణితో రూ.450, శివాలయం ద్వారా రూ.2వేలు, పాతగుట్టతో రూ.12,390లతో కలిపి స్వామివారికి రూ.5,54,940 ఆదాయం లభించిందని వెల్లడించారు.  

అర్చనలు.. ఆరాధనలు

యాదాద్రి, మార్చి 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొన్నది. బుధవారం వేకువజామునకే స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. సాయంత్రం వేళ అలంకార సేవలు నిర్వహించారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం సమయంలో అష్టోత్తరసేవలో భక్తులు పాల్గొని తరించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్దఎత్తున జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి మొక్కు పూజలను రద్దు చేశారు. 

స్వామి వారి సేవలో ఆది

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని తెలుగు సినీ నటుడు ఆది దర్శించున్నారు. స్వామివారి సువర్ణాపుష్పార్చనతోపాటు అష్టోత్తర సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement