e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home హైదరాబాద్‌ గుప్పెడు గుండెకు ఒత్తిడి పెంచొద్దు..!

గుప్పెడు గుండెకు ఒత్తిడి పెంచొద్దు..!

 • నేడు వరల్డ్‌ హార్ట్‌ డే
 • చిన్న వయస్సులోనే గుండెపోటుతో పెరుగుతున్న మరణాలు
 • వ్యాయామం, మంచి ఆహారం తప్పనిసరి
 • సైక్లిస్టుల ఆధ్వర్యంలో నేడు 5కే, 3కే రన్‌ ఈవెంట్స్‌
 • గుండె పనితీరుపై అవగాహన కల్గించనున్న వైద్యులు
 • యోగా, ధ్యానం చేయాలంటూ సూచనలు
 • ఒత్తిడి పెరిగితే గుండెకు ముప్పు

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 28(నమస్తే తెలంగాణ): హృదయం మన పిడికిలంతే.. అయినా నిరంతర స్పందనలతో మన ప్రాణాలను నిలబెడుతుంది. ‘మంచి’ రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ మన గమనంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి గుండె.. ఇప్పుడు అలిసిపోతుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల యువకుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం మారుతున్న జీవన శైలియే అని వైద్యులు చెబుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముందస్తు అప్రమత్తత.. సరైన వ్యాయామంతో గుండె మరణాలను 80 శాతం తగ్గించొచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నేడు వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా నగరంలో భారీ ఎత్తున హైదరాబాద్‌ సైక్లిస్టులు 5కే సైక్లింగ్‌, 3కే రన్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ‘చిట్టి గుండెను కాపాడుకుందాం’ అంటూ అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు.

బలహీనతలు తెలుసుకో..!!

పొగ అలవాటు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం, గాలి కాలుష్యం వంటి కారణాలతో జనం గుండె జబ్బుల బారినపడుతున్నారు. ప్రధానంగా పొగ తాగే అలవాటు చిన్న పిల్లల్లో ఉంటే వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గుండెకు సంబంధించిన ప్రమాదాన్ని 8 రెట్ల పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్‌ కూడా గుండె జబ్బులకు ప్రధానం కారణం. తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్‌ లేదా చెడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ గుండె జబ్బులకు దారి తీస్తుంది. 250 మందిలో ఒకరికి ఎఫ్‌హెచ్‌ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎఫ్‌హెచ్‌ ఉన్న పురుషులలో సగం మందికి 50 ఏళ్లు రాక ముందే గుండెపోటు సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో 30 శాతం మందికి 60 ఏళ్లు వచ్చేలోపు గుండెపోటు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.90 కోట్ల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హృదయానికి సంబంధించిన ఏ ఒక్క విషయలోనూ నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటిద్దాం..!

 • పోషకాహారం తీసుకోవాలి. వేరుశనగ, నారింజ, ఓట్స్‌, వాల్‌నట్స్‌, అవోకాడో లాంటివి తరచూ తీసుకోవాలి.
 • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
 • ఒత్తిడిని తగ్గించుకోవడం అత్యంత ముఖ్యం. ఒత్తిడి హోర్మోన్లను విడుదల చేస్తుంది. ధమనుల సంకోచానికి కారణమయ్యే రసాయనాలను పెంచుతుంది. ఇది శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
 • ప్రధానంగా సోడియం తీసుకోవడం తగ్గించాలి.
 • జీవన శైలి మార్పులతో రక్తపోటు తగ్గించుకోవాలి.
 • గుండెపోటు గురైన వాళ్లు వారం మొత్తంలో 3 గంటల నుంచి నాలుగు గంటల పాటు నడవగలిగితే మృతి చెందే అవకాశాలు 54 శాతం తగ్గుతాయి. ఇది మెడికల్‌ జర్నల్‌ న్యూరాలజీలో ప్రచురితమైంది. 75 ఏండ్లకు తక్కువ ఉన్నవాళ్లు వ్యాయామం చేయడం వల్ల వారిలో మరణించే అవకాశాలు 80 శాతం తగ్గుతాయని వెల్లడించింది.
 • రక్త నాళాల్లో అధికంగా కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో దీని వల్ల గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడంతో హార్ట్‌ స్ట్రోక్స్‌ వస్తున్నాయి.
 • సైక్లింగ్‌, రన్నింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ వంటి కార్డియో ఎక్సర్‌సైజ్‌లు గుండెకు మంచివి. g యోగా, ధ్యానం చేయాలి.

వీటిని దూరం చేసుకుందాం..!!

 • జంక్‌ ఫుడ్‌
 • అధిక మద్యం
 • అధిక ఒత్తిడి..
 • సిగరెట్‌

గుండెజబ్జు లక్షణాలు

 • ఛాతినొప్పి
 • ఎడమ వైపు తీవ్రమైన నొప్పి
 • ఛాతి మధ్యలో నొప్పి నిమిషం కంటే ఎక్కువగా ఉంటుంది.
 • బలహీనంగా అనిపిస్తుంటుంది
 • దవడ, మెడ, వీపులో నొప్పి ఉంటుంది.
 • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement