మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 06:13:11

సైబర్​ నేరగాళ్లుగా మారిన కూలీలు

సైబర్​ నేరగాళ్లుగా మారిన కూలీలు

అప్పుడు కూలీలు..

ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు ఏజెంట్లు

ఒకప్పుడు ఫ్యాక్టరీ కూలీలు.. ఇప్పుడు సైబర్‌చీటర్లకు ఏజెంట్లు.. భారీగా సంపాదన. వీరి విద్యార్హత  అంతంత మాత్రమే. పేటీఎం తదితర వేదికల నుంచి పలువురి ఫోన్‌ నంబర్లు సేకరించడం, బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆ పత్రాలను సైబర్‌చీటర్లకు అందిస్తూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాగే నకిలీ ఆర్మీ ఉద్యోగుల ఐడీతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. 

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

ఓఎల్‌ఎక్స్‌ వేదికగా అమాయకులకు బురిడీ

సామాజిక మాధ్యమాలే వేదికగా అమాయకులకు బురిడీ.. లక్షల్లో మోసం

సైబర్‌ క్రైం పోలీసుల నిఘా

ఐదుగురు అరెస్టు

ట్రై పోలీసు కమిషనరేట్లలో వీరిపై 40 చీటింగ్‌ కేసులు

వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

రాజస్థాన్‌ భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఐదుగురు కొన్ని రోజుల నుంచి ఆర్మీ అధికారులమంటూ ఓఎల్‌ఎక్స్‌, తదితర సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రకటనలు చేస్తూ పలు మోసాలకు పాల్పడుతున్నారు. తమకు వేరేచోటికి బదిలీ అయ్యిందని చెబుతూ వివిధ సామగ్రిని విక్రయిస్తున్నారు. ఇలా రోజురోజుకూ పెరుగుతున్న వారి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సాంకేతిక పరంగా ఆధారాలు సేకరించారు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌ ప్రాంతాల్లో 2 వారాల పాటు మాటు వేశారు రుక్మీన్‌, ముర్‌ఫిద్‌, సైకుల్‌ఖాన్‌, షారుక్‌, రకమ్‌ఖాన్‌లను అరెస్టు చేశారు. విచారణలో ఈ ఐదుగురు దాదాపు 40 మోసాలకు పాల్పడినట్లు తేలింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయి. రుక్మీన్‌, రకమ్‌ఖాన్‌లకు ముర్‌ఫిద్‌, సైకుల్‌ఖాన్‌, షారూక్‌ 8 నుంచి 10 శాతం కమీషన్‌తో ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరు చదివింది పదిలోపేనని తేలింది. వీరి నుంచి లక్ష నగదు, మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్నందుకు సైబర్‌ క్రైం బృందాన్ని సీపీ సజ్జనార్‌ అభినందించి రివార్డులందించారు. సమావేశంలో డీసీపీ క్రైమ్స్‌ రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ క్రైమ్స్‌ కవిత, ఏసీపీ సైబర్‌ క్రైమ్స్‌ శ్యాంబాబు పాల్గొన్నారు.  ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్‌ నుంచి అప్రమత్తంగా ఉండేందుకు సీపీ సజ్జనార్‌ పలు సూచనలిచ్చారు. 

తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి

* వస్తువును ప్రత్యక్షంగా చూడకుండా సోషల్‌ మీడియా వేదికల్లోని ప్రకటనలు నమ్మొద్దు.

* వస్తువును విక్రయించే అసలు యజమానులు ధరను కచ్చితంగా చెబుతారు. సైబర్‌ క్రిమినల్స్‌ ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు.

* వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు.

* వస్తువులను కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా అసలైన వెబ్‌సైట్లనే ఎంపిక చేసుకోండి. 

* నగదు వాపసు వస్తుందంటే నమ్మొద్దు.

* క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. 

* ఓఎల్‌ఎక్స్‌ వేదికగా ఆర్మీ అధికారులు, పోలీసు అధికారులమని ఇచ్చే ప్రకటనలకు బోల్తా పడొద్దు. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. కేవలం ఫొటోల ద్వారా అంటే అది చీటింగేనంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. 

logo