శివలాల్ నేత.. వయస్సు ముప్పై ఏండ్లు.. ఎత్తు మూడడుగులు. మరుగుజ్జుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఎక్కడా కుంగిపోలేదు. కుటుంబంతో చక్కగా కారులో రైడ్‌కు వెళ్లాలని..అందరిలాగానే తనూ కలలు కన్నాడు. కారు తీసుకున్నా.. దాన్ని నడిపేదెలా..? అన్న సంశయం నుంచే తనకు సమాధానం దొరికింది. అందుకే డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎన్నో డ్రైవింగ్ స్కూల్స్‌కు తిరిగాడు. అన్ని శిక్షణా కేంద్రాల నుంచి ఒక్కటే వెక్కిరింపు.. ‘స్టీరింగ్ అంత లేవు.. డ్రైవింగ్ కావాల్సి వచ్చిందా..?’ అంటూ హేళన చేసిన వాళ్లే ఇప్పుడు ‘నువ్వు గ్రేట్’ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కాలనీకి చెందని శివలాల్నేతకు డ్రైవింగ్ నేర్చుకోవాలనేది ఓ కల. ఇందుకు కోసం నగరంలోని అనేక వాహన స్కూల్స్‌ను సంప్రదించారు. కానీ ఎవ్వరూ నేర్పించలేదు. అయినా తను పట్టుదలతో మిత్రుల సహకారంతో డ్రైవింగ్ నేర్చుకున్నారు. బీకాం చదివిన శివలాల్‌కు కారు మోడిఫికేషన్‌కు మూడు నెలలు, డ్రైవింగ్‌కు 3 నెలల సమయం పట్టింది. ఆరు నెలల కాలంలోనే కారు డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ పొంది విమర్శించిన నోళ్లతోనే ప్రశంసలు దక్కించుకున్నాడు.
తెలుగు రాష్ర్టాల్లో పర్మినెంట్ లైసెన్స్ పొందిన ఏకైక వ్యక్తి కూడా ఇతడే కావడం విశేషం. ఈ రికార్డుకుగాను శివలాల్ నేత 170 దేశాల్లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే ‘ది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ ధ్రువీకరణ పత్రాన్ని ఆగస్టు 6న అతడికి అందించారు. రాబోయే రోజుల్లో తన సహచరికి కూడా డ్రైవింగ్ నేర్పాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. మరుగుజ్జులు తమ వైకల్యాన్ని చూసి కుంగిపోకుండా కష్టపడి కలలను నిజం చేసుకోవాలని చెప్పారు.
దివ్యాంగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్లలో అనేక మినహాయింపులు పొందొచ్చు. జీఎస్టీతో పాటు లైఫ్ ట్యాక్స్ కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ విధానం తప్పనిసరిగా పాటించాలి. మొదటగా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి తనకు అనువుగా ఉన్న వెహికిల్‌ను ఎంపిక చేసుకోవాలి. కొటేషన్ తీసుకుని దానికి ఆన్లైన్లో జీఎస్టీ ఐప్లె చేస్తే వారంలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది. దానిని తీసుకుని షోరూమ్‌కి వెళ్లి వాహనం కొనుగోలు చేయొచ్చు. ఈ వాహనాన్ని నగరంలోని దక్కన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజీ సెంటర్‌కు తీసుకెళితే దానిని మాడిఫికేషన్ చేస్తారు.
ఈ సంస్థకు మాత్రమే రాష్ట్రంలో కార్లను రీమోడల్ చేసే అనుమతి ఉంది. ఈ లోపున దివ్యాంగులు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటే, పీహెచ్సీ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించి లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఈ లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని మాడిఫికేషన్ పూర్తయిన వాహనంతో ఆర్టీఏ కార్యాలయానికి వెళితే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అనంతరం నిర్ణీత సమయంలోపు టెస్ట్ డ్రైవ్‌కు హాజరై డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అయితే అతడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాన్ని మాత్రమే నడపాల్సి ఉంటుంది. మరే ఇతర వాహనం నడపకూడదు. అందుకు సంబంధించిన వివరాలన్నీ ఆర్టీఏ రికార్టుల్లో నిక్షిప్తం చేస్తారు.