బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 23:49:10

నిండు చూలాలికి అమ్మలా..

నిండు చూలాలికి అమ్మలా..

పొట్టచేతపట్టుకొని.. పక్క రాష్ట్రాలనుంచి వచ్చి.. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్నగర్భిణులను కన్నతల్లిలా అక్కున చేర్చుకున్నారు. కాలినడకన సొంతూర్లకు వెళ్లడానికిసిద్ధమవుతున్న వేళ  స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆపన్నహస్తం అందించింది. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని సుమారు 3 వేల మంది  గర్భిణులు, చిన్నారులను చేరదీసి మిల్లెట్స్‌తో కూడిన పోషకాహారం ప్యాకెట్లు అందించి ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపుతున్నది.

మేడ్చల్ : వాళ్లంతా పొట్టచేతపట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన నిండు గర్భిణులు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో  రోడ్డున పడ్డారు. దిక్కుతోచని స్థితిలో వేల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆపత్కాలంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇలాంటి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించింది. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ జిల్లా నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూడువేల మంది ఇతర రాష్ట్రాల గర్భిణులను, చిన్నారులను చేరదీసి ప్రత్యేక వాహనాల్లో ఉచితంగా సొంతూళ్లకు పంపుతున్నారు. 

 అంతే కాదు గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేకంగా కిట్లను అందించారు. గర్భిణులకు ఇచ్చే వాటిలో పోషకవిలువలు కలిగిన మిల్లెట్స్‌తో తయారు చేసిన స్నాక్స్‌, రెండు బిస్కెట్‌ ప్యాకెట్లు, మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, చేతులను నిత్యం శుభ్రం చేసుకోవడం కోసం సోప్స్‌, మాస్కులు, శానిటరీ నాప్‌కిన్స్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లను అందిస్తున్నారు.

       అలాగే చిన్నారులకు ఇచ్చే వాటిలో ఒక్క శానిటరీ నాప్‌కిన్స్‌ తప్ప మిగిలిన వస్తువులు ఇస్తున్నామని,అలాగే మహిళలకు, చిన్నారులకు  చెప్పులను అందిస్తున్నామని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్వరూపరాణి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇప్పటి వరకు రాయ్‌పూర్‌, ఒడిశా, బీహార్‌, మధ్యప్రదేశ్‌తో పాటు తదితర రాష్ట్రాలకు చెందిన గర్భిణులు, చిన్నారులను ప్రత్యేక బస్సులు, రైళ్లలో తరలించామని ఆమె తెలిపారు. 


logo