ఆదివారం 05 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 01:11:16

10 రోజుల్లోగా మూసీ సరిహద్దులను గుర్తించండి

10 రోజుల్లోగా మూసీ సరిహద్దులను గుర్తించండి

తీర ప్రాంతాల్లో కబ్జాలను అరికట్టండి 

సమీక్షలో అధికారులకు ఎంఆర్‌డీసీఎల్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి ఆదేశాలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాబోయే రోజుల్లో మూసీ నదిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే విధంగా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. తార్నాకలోని ఎంఆర్‌డీసీఎల్‌ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన సర్వేయర్లతో చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ విశ్వజీత్‌ కంపాటి, చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌ నాయక్‌లు మూసీ నది పరిరక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నది ప్రక్షాళనకు సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్పష్టమైన ఆలోచన ఉన్నదని, ఆ ఆలోచన మేరకే మూసీ కార్పొరేషన్‌ ముందుకు తీసుకుపోతున్నామని పేర్కొన్నారు.  పక్కా ప్రణాళికలతో మూసీనది హద్దులను గుర్తించి, సర్వే వివరాలను 10 రోజుల్లో ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. మూసీ తీర ప్రాంతాలు కబ్జాకు గురికాకుండా చూడాలన్నారు. మూసీ 40 కిలోమీటర్ల మేర సరిహద్దులు గుర్తించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ మాలతీ, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo