బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Aug 24, 2020 , 23:32:43

రూ.30కోట్లతో.. అభివృద్ధి పనులు

రూ.30కోట్లతో.. అభివృద్ధి పనులు

మరిన్ని నిధులకు ప్రతిపాదనలు పంపాం

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

అధికారులతో సమీక్షా సమావేశం 

 బంజారాహిల్స్‌:  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.30కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక సహకారం అందిస్తున్నారన్నారు.  సీసీ రోడ్లు, కమ్యూనిటీహాళ్లు, వరదనీటి కాలువలతో పాటు పార్కుల అభివృద్ధి తదితర 116 పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నామని పేర్కొన్నారు. కల్యాణ్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ పార్కు అభివృద్ధికి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇవి కాకుండా జలమండలి ఆధ్వర్యంలో సీవరేజీ, తాగునీటి పైపులైన్ల కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.20 కోట్ల మేర ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ప్రస్తుతం ఉన్న తాగునీటి ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం కోసం రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రహ్మత్‌నగర్‌, బోరబండ డివిజన్ల పరిధిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. యూసుఫ్‌గూడ చౌరస్తాలోని సెట్విన్‌ భవనం నిర్మాణం కోసం రూ.5.90 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో   జలమండలి జీఎం ప్రభు, చిట్టిబాబు, జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌, ఏఈ సునీల్‌, జమీల్‌ తదితరులు  పాల్గొన్నారు.