గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 00:15:36

ప్లాస్మా దానంతో.. ప్రాణదాతలు కండి..!

ప్లాస్మా దానంతో.. ప్రాణదాతలు కండి..!

సినీ నటుడు విజయ్‌ దేవరకొండ 

వెబ్‌పోర్టల్‌కు అనూహ్య స్పందన

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

పలువురు ప్లాస్మా దాతలకు సన్మానం

రక్తదానంలో వరల్డ్‌ రికార్డ్‌.. ఇప్పుడు ప్లాస్మా దానం

నగరానికి చెందిన డాక్టర్‌ సంపత్‌ 20 సంవత్సరాలుగా 212 సార్లు రక్తదానం చేసి రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా 2 సార్లు ప్లాస్మాదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అతి చిన్న వయసులో రక్తదానం చేసిన రికార్డుతోపాటు అతి తక్కువ వయసులో అత్యధిక రక్తదానాలు చేసిన వ్యక్తిగా వరల్డ్‌ రికార్డు సాధించిన ఆయన ప్లాస్మా దానంలోనూ ముందుండటం విశేషం. 

శేరిలింగంపల్లి : తాను కరోనా బారిన పడి విజయం సాధించినట్లయితే కచ్చితంగా ప్లాస్మా దానం చేస్తానని ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమానికి ఆయన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాస్మా డొనేట్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా కొవిడ్‌ మహమ్మారిని జయించి ప్లాస్మాను దానం చేసిన పలువురికి వారు ప్రశంసాపత్రాలను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఇటీవల తన స్నేహితుడి తండ్రికి కరోనా వచ్చి ప్రాణాపాయస్థితిలో దవాఖానలో చికిత్స తీసుకుంటుండగా ప్లాస్మా అవసరం అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. ప్లాస్మా కోసం ఎవరని కలవాలి, ఎక్కడికి వెళ్లాలి.. అనే అయోమయం నెలకొందన్నారు. ప్రాణాపాయస్థితి నుంచి బయట పడాలంటే ప్లాస్మా కీలకమని తాను అప్పుడే గుర్తించానన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైబరాబాద్‌ పోలీసులు కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు ఓ చక్కని వేదికను సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. donateplasma.scsc.in వెబ్‌ పోర్టల్‌ ఆధారంగా కరోనా విజేతలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి మరికొందరి జీవితాలను కాపాడాలని ఆయన కోరారు. ప్లాస్మా దానంపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. కరోనా బారిన పడిన ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌ వేదిక ద్వారా తాను ప్లాస్మా దానానికి సిద్ధమని ట్వీట్‌ చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూడకుండా కరోనాను జయించేందుకు ప్లాస్మా కీలకమన్నారు. సీపీ సజ్జనార్‌ శాంతి భద్రతతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీఎస్సీ ద్వారా ప్లాస్మా దానానికి ఇటీవల ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీన్ని అందుబాటులోకి తెచ్చిన 10 రోజుల్లోనే 210 మంది కరోనా బాధితులకు ప్లాస్మా సహాయం చేశామన్నారు. 126 మంది ఇప్పటికే తమ వేదిక ద్వారా ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు.ప్రస్తుతం 500మంది బాధితులు తమకు ప్లాస్మా కావాలని పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి కృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సినీనటుడు విజయ్‌దేవరకొండ పిలుపునిచ్చారు. తాను వైరస్‌బారినపడి కోలుకుంటే కచ్చితంగా ప్లాస్మాను ఇస్తానన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో జరిగిన ప్లాస్మాదాతల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి పలువురి జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు. కరోనా విజేతలు donateplasma .scsc.in ద్వారా ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మాను దానం చేయాలని కోరారు. ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన 10రోజుల్లోనే 210మంది కొవిడ్‌ బాధితులకు ప్లాస్మా సహాయం చేశామన్నారు. మరో 500మంది బాధితులు ప్లాస్మా కోసం రిజిస్టర్‌ చేసుకున్నారని సీపీ వివరించారు. ఇప్పటివరకు 126  ప్లాస్మాను ఇచ్చి ఆదర్శంగా 

నిలిచారన్నారు.

ప్లాస్మా థెరపీ కీలకం..

కరోనా నుంచి బయట పడేందుకు ప్లాస్మా థెరపీ కీలకంగా నిలుస్తుంది. విదేశాల్లో ప్లాస్మా థెరపీ కొవిడ్‌ను జయించడంలో సత్ఫలితాన్నిచ్చింది. మన దేశంలోనూ దీని వినియోగం పెరగాలి. ప్లాస్మా దానంపై మరింత అవగాహన కల్పించాలి.   -డాక్టర్‌ సంపత్‌

కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కొవిడ్‌ను జయించిన వారు అందరూ ప్లాస్మా దానంలోనూ ముందుండాలి. కరోనా విజేతలుగా వారికి ఇది ఓ సదావకాశం. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్లాస్మా బ్యాంక్‌ అవసరం ఉంది. ఈ దిశగా కృషి చేయాలి.  

-లక్ష్మణ్‌ కుమార్‌, వీరమాచనేని


logo