బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Sep 16, 2020 , 01:10:45

పుట్టగొడుగులతో.. కాసుల పంట

పుట్టగొడుగులతో.. కాసుల పంట

సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం

‘యాక్‌గ్రోమలిన్‌' సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ

తక్కువ పెట్టుబడితో నెలవారీ ఆదాయం  

ఎలాంటి రసాయనాలు లేకుండా సరికొత్త విధానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కాస్త ఖాళీ జాగా ఉంటే చాలు.. పుట్ట గొడుగులతో కాసుల పంట పండించవచ్చు. ఇంట్లో ఉండే గృహిణులు సైతం నెలసరిగా వేలాది రూపాయలు సంపాదించవచ్చు. వ్యవసాయం చేసేందుకు కనీసం ఎకరం భూమి లేదా కొన్ని గుంటల భూమైనా ఉండాలి. కాని ‘యాక్‌గ్రోమలిన్‌' సంస్థ వారు వ్యవసాయం చేయడానికి ఎకరాల కొద్ది భూమి అవసరం లేదని, చదరపు అడుగుల స్థలం ఉంటే చాలని అంటున్నారు. ఆ స్థలంలో మహిళా రైతులే.. ఎంతో విలువైన పంటను పండించి, ఆర్థికపరంగా సమాజంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. అయితే మహిళలకు 40 రోజుల పాటు ‘పుట్ట గొడుగుల’పంటపై శిక్షణ ఇస్తున్నారు. వారు పండించిన పంటను సంస్థనే కొనుగోలు చేస్తుంది. 

మహిళా రైతులతో పుట్టగొడుగుల పంట

‘యాక్‌గ్రోమలిన్‌' అనే సంస్థ నగరంలో మహిళా రైతులతో పుట్ట గొడుగుల పెంపకానికి శ్రీకారం చుట్టింది. 300 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగులను సాగు చేస్తున్నారు. మహిళలు ఒక్క పంటతో నెలకు రూ.6వేల నుంచి రూ.15వేల వరకు సంపాదించేందుకు ఈ సంస్థ తర్ఫీదు ఇస్తున్నది. ఈ పంట ద్వారా మహిళలు యేడాదికి రూ.లక్షకుపైగా ఆర్జిస్తున్నారు. కొత్తకొత్త మెళకువలతో రైతులు అభివృద్ధి దిశగా పయనించేందుకు యాక్‌గ్రోమలిన్‌ కృషి చేస్తున్నది. అతి తక్కువ పెట్టుబడికి పంటకు కావాల్సిన ముడి సరుకు, పరికరాలు, సామగ్రిని అందజేస్తున్నారు. 

శిక్షణతో పాటు విత్తన సామగ్రి..

ఉప్పల్‌లోని సంస్థ కార్యాలయంలో మహిళలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ‘యాక్‌గ్రోమలిన్‌' సంస్థ పది వెదురు కర్రల ర్యాక్స్‌ను, స్ట్రా/ గడ్డి, విత్తనాలు, సాగుకు వాడే మట్టి, కవర్లు, సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు 9100090615 లేదా 9100090616లో సంప్రదించి మరిన్ని వివరాలను పొందవచ్చు. 

‘బై బ్యాక్‌.. పాలసీ..’

రైతులకు కచ్చితంగా ఒక నిర్ణీత రాబడి వచ్చేలా ‘బై బ్యాక్‌' పాలసీని అమలు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన అనంతరం రైతులకు పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక తికమకపడాల్సిన అవసరం లేదు. రైతులకు ఈ విధానంపై నమ్మకం.. పంట మీద అవగాహన కల్పించేందుకు సంస్థ ఆర్గనైజర్స్‌ వెన్నంటే ఉంటున్నారు. ఆ పంటను సంస్థ వారే కొనుగోలు చేసి మహిళా రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చుతున్నారు. 

 ఆసక్తి ఉన్న గృహిణులు ప్రయత్నించవచ్చు..

అదనపు ఆదాయం కోసం ప్రయత్నించే గృహిణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మీ ఇంట్లోనే ఒక గదిలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. నగరంలో ఆర్గానిక్‌ పుట్ట గొడుగులకు మంచి గిరాకీ ఉంది. పుట్ట గొడుగులు ప్రొటీన్లు గల కూరగాయలు. ‘యాక్‌గ్రోమలిన్‌' మహిళా రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పంట దిగుబడి, అమ్మకం, రాబడిపై మంచి అవగాహన కల్పిస్తుంది. దీని ద్వారా మహిళలకు నెలవారి ఆదాయం వచ్చేలా చూస్తుంది. 

- హిమబిందు, డైరెక్టర్‌, యాక్‌గ్రోమలిన్‌ సంస్థ


logo