మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 07, 2020 , 01:44:55

తీరొక్క థీమ్‌తో..

తీరొక్క థీమ్‌తో..

సిటీలో వైవిధ్య ఉద్యానవనాలు 

7.50 లక్షల చదరపు మీటర్లలో ..

రూ.120 కోట్లతో.. 50 ప్రాంతాల్లో ఏర్పాటు

 పూర్తయిన నమూనాలు, కొనసాగుతున్న టెండర్లు

ఏడాది చివరికల్లా కొన్ని అందుబాటులోకి..

పచ్చదనంతో అలరారుతున్న చారిత్రక నగరం... అందమైన ‘థీమ్‌'లతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. 7.50 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విభిన్న తరహాల్లో నిర్మించే ఈ ఉద్యానవనాలు ప్రతి మదిని దోచుకోనున్నాయి. ఆహ్లాదం పంచేవి.. చైతన్యం పెంచేవి.. సందేశమిచ్చేవి.. ఇలా విభిన్నమైన రీతిల్లో 50

ప్రాంతాల్లో  ఇవి  రూపుదిద్దుకోనున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున వైవిధ్యమైన కళారూపాలను ఏర్పాటు చేస్తుడటం విశేషం. 

3,084 ఖాళీ స్థలాలు.. 

విశ్వనగరంగా ఖ్యాతి గడించిన భ్యాగనగరం ఇక ఉద్యానవనాలతో కళకళలాడనున్నది. రూ.120 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న థీమ్‌ పార్కులతో ఆహ్లాదాన్ని పంచనున్నది. పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ఖాళీ స్థలాలను పరిరక్షిస్తూ..వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు.. అందమైన థీమ్‌ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది బల్దియా.  వివిధ లే ఔట్లు, మున్సిపల్‌ ఖాళీ స్థలాలు అన్నీ కలిపి జీహెచ్‌ఎంసీ పరిధిలో 1727 ఎకరాల విస్తీర్ణంలో 3,084 ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిల్లో పెద్ద ఎత్తున గ్రీనరీని పెంపొందించాలనే ఉద్దేశంతో పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎకరం, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమున్న స్థలాల్లో థీమ్‌ పార్కులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. జోన్ల వారీగా 50 ప్రాంతాలను గుర్తించి అక్కడ ‘థీమ్‌'లు అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే నమూనాలను కూడా సిద్ధం చేశారు. ఒక్కో పార్కుకు రూ. 2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం రూ. 120 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం జోన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరికల్లా కొన్నింటిని పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆహ్లాదాన్ని పంచుతూ..

సందేశమిస్తూ..

విద్యార్థుల కోసం సైన్స్‌, దట్టమైన అడవులను తలపించే జపనీస్‌, వ్యాయామ ప్రియులు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం పంచతత్వ పార్కులు, ఆట వస్తువులు, విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా పిల్లల పార్కు, ప్రత్యేకించి మహిళల పార్కు, బాంబూ గార్డెన్‌, అన్ని వయస్సుల వారికి  అవసరమైన రీతిలో మల్టీ జనరేషన్‌ పార్కు, వినోదం కోసం కమ్యూనిటీ పార్కు, అందమైన రాక్‌ గార్డెన్‌, పండుగ వాతావరణాన్ని తలపించే బతుకమ్మ పార్కు, వివిధ రకాల ఆటలతో సేదతీరే విధంగా ప్లే పార్కు, రంగు రంగుల కాంతులు విరజిమ్మే ఎల్‌ఈడీ, ఏడు రకాల ప్రత్యేకతలతో కూడిన సెవెన్‌ వండర్స్‌... ఇలా వివిధ రకాల థీమ్‌లు ఉన్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టోపెరీ గార్డెన్‌, కలర్స్‌ పార్కు, జపనీస్‌ థీమ్‌, మొఘల్‌ గార్డెన్‌, ఇంటరాక్టివ్‌ పార్కు, ఫ్రాగ్రెన్స్‌, రాక్‌ గార్డెన్‌, ఎన్విరాన్‌మెంటల్‌, ఫ్లవర్‌ తదితర థీమ్‌లను ఇప్పటికే రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

అందుబాటులోకి వచ్చినవి..

శేరిలింగంపల్లిలో డాగ్‌, కిషన్‌బాగ్‌, మీరాలం లేక్‌ ఉద్యానవనాలు, శేరిలింగంపల్లి పంచతత్వ పార్కు, మలక్‌పేట దివ్యాంగుల పార్కు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 36, ట్రాన్సిట్‌ పార్కు, ఫ్రూట్‌ తదితర ఆరు థీమ్‌ పార్కులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఇవేకాకుండా ట్రాఫిక్‌ ఐలాండ్ల సుందరీకరణలో భాగంగా పలు జంక్షన్లను సైతం వివిధ  కాన్సెప్ట్‌లతో పచ్చని అందాలతో తీర్చిదిద్దారు. ఇక స్థానిక ప్రత్యేకతల ఆధారంగా కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. చింతలకుంట చౌరస్తా వద్ద రామోజీ ఫిల్మ్‌ సిటీ, మహావీర్‌ హరిత వనస్థలి తదితర థీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమాటోగ్రాఫర్‌  ప్రతిమ విశేషంగా ఆకట్టుకుంటున్నది. అలాగే సుచిత్ర జంక్షన్‌ను హైదరాబాద్‌ జీవన విధానాన్ని తెలిపే విధంగా డిజైన్‌ చేశారు.  నగరం అనగానే గుర్తుకొచ్చే ఇరానీ చాయ్‌ను ప్రతిబింబించేలా ఈ జంక్షన్‌లో కేట్లీతో చాయ్‌ పోస్తున్నట్లుగా నిర్మించిన ఫౌంటెన్‌ ఆకర్షిస్తున్నది. మెట్టుగూడ జంక్షన్‌లో తెల్లరాళ్లతో మెట్ల ఆకారాన్ని నిర్మించి.. అందులో ఫౌంటెన్‌ అందంగా తీర్చిదిద్దారు. అలాగే లక్డీకాపూల్‌ జంక్షన్‌లో కట్టె వంతెన, సంగీత్‌ జంక్షన్‌లో వివిధ రకాల సంగీత వాయిద్యాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.

జోన్ల వారీగా ప్రతిపాదిత థీమ్‌ పార్కులు, వాటి విస్తీర్ణం వివరాలు..

ఎల్బీనగర్‌ జోన్‌..

పార్కు ప్రాంతం       విస్తీర్ణం        విభిన్న 

(చ.మీ.లలో) రీతిల్లో థీమ్‌లు

ఏఎస్‌రావునగర్‌, 7549 ట్రాఫిక్‌

శాంతినికేతన్‌ స్కూల్‌

చర్లపల్లి, బీఎన్‌రెడ్డినగర్‌ 12202 ఎనర్జీ కన్వెన్షన్‌

చర్లపల్లి, ఈసీనగర్‌ 4930 పాట్రియాటిక్‌ 

వాసవీ ఎన్‌క్లేవ్‌, కాప్రా సర్కిల్‌ 5642 స్కల్‌ప్చర్‌ 

బండబావి, నర్సరీ వద్ద 19568 నాలెడ్జ్‌  

కాప్రా సర్కిల్‌

సంజీవయ్య పార్కు, మల్లాపూర్‌ 10816 స్వచ్ఛత టెంపుల్‌ 

ఆనమ్‌గల్‌ పార్కు, హయాత్‌నగర్‌ 2200

ప్రగతినగర్‌, ఉప్పల్‌ 1935 హెర్బల్‌ 

టీచర్స్‌కాలనీ, ఎల్బీనగర్‌ సర్కిల్‌ 4880 ఉమెన్స్‌ 

సచివాలయనగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్‌ 4120 తెలంగాణ కాన్సెప్ట్‌ 

సాహెబ్‌నగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్‌ 8000 వాటర్‌ కన్జర్వేషన్‌ 

ఇంద్రప్రస్త కాలనీ, సర్కిల్‌-4 3051 స్కేర్డ్‌ 

సరూర్‌నగర్‌, హుడాకాలనీ 6380 చిల్డ్రన్‌ 

చార్మినార్‌ జోన్‌..

శాలివాహననగర్‌, మూసారామ్‌బాగ్‌ 7000 స్వచ్ఛత

రాజేంద్రనగర్‌, జనచైతన్య కాలనీ 11500 వాటర్‌ హార్వెస్టింగ్‌ 

రాజేంద్రనగర్‌, గోల్డెన్‌హైట్స్‌ కాలనీ 8000 ఎడ్వెంచర్‌ 

ఖైరతాబాద్‌ జోన్‌..

బంజారాహిల్స్‌ ఎమ్మెల్యేకాలనీ 9978 సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

బంజారాహిల్స్‌, 9183 స్వచ్ఛత

రోడ్‌ నం. 12 మిథిలానగర్‌

జూబ్లీహిల్స్‌, రోడ్‌ నం. 86, ఫిల్మ్‌నగర్‌ 137733 రాక్‌ గార్డెన్‌

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 51 72846 ఎడ్వెంచర్‌ 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-10, గార్డెన్‌ 48564 హెర్బల్‌ 

ప్రశాసన్‌నగర్‌, జూబ్లీహిల్స్‌ 34949 ఉమెన్‌ 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 25 34400 కాళేశ్వరం ప్రాజెక్టు 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-74, 75 25351 వాటర్‌ హార్వెస్టింగ్‌ 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 32, 32 14861 నాలెడ్జ్‌ 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-36, 14529 చిల్డ్రన్‌ 

రెయిన్‌బో గార్డెన్స్‌

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-32 11653 తెలంగాణ కల్చర్‌ 

దస్‌పల్లా హోటల్‌, జూబ్లీహిల్స్‌ 10939 సెవన్‌ వండర్స్‌ 

రోడ్‌ నం-37 ఆఫ్‌ తెలంగాణ

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-1, 92 10353 ఎనర్జీ కన్వెన్షన్‌

శేరిలింగంపల్లి జోన్‌..

ప్రతీకనగర్‌, మాదాపూర్‌ 5300 సైన్స్‌ 

నల్లగండ్ల హుడా లేఔట్‌-2 18055 స్వచ్ఛత 

నల్లగండ్ల రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ 17542 స్వచ్ఛత 

టీఎన్‌జీవో కాలనీ, శేరిలింగంపల్లి 18500 ఫెంగ్‌ షుయ్‌

నల్లగండ్ల హుడా లేఔట్‌-21 8000 ట్రాఫిక్‌ 

నల్లగండ్ల హుడా లేఔట్‌-10 21728 స్పెషల్‌ నీడ్స్‌ 

మియాపూర్‌ మయూరీనగర్‌ 17440 ఎంజీఎన్‌ 

హఫీజ్‌పేట్‌ మాతృశ్రీనగర్‌ 13945 బౌన్స్‌ 

చందానగర్‌ వెంకటేశ్వరకాలనీ 21382 వాటర్‌ హార్వెస్టింగ్‌ 

కూకట్‌పల్లి జోన్‌..

కేపీహెచ్‌బీ వసంతనగర్‌ 16188 వాటర్‌ హార్వెస్టింగ్‌ 

మేజర్‌ పార్కు

కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌ 6070 స్వచ్ఛత 

బస్‌స్టాప్‌ పార్కు

కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ పార్కు 4047 స్వచ్ఛత 

కేపీహెచ్‌బీ ముళ్లకత్వ చెరువు 80940 యూనివర్సల్‌ వాటర్‌  

దండమూడి కాలనీ 8094 చిల్డ్రన్‌ 

టీఎస్‌హెచ్‌సీ పార్కు 8094 అర్బన్‌

సికింద్రాబాద్‌ జోన్‌..

పార్కు ప్రాంతం       విస్తీర్ణం        విభిన్న 

(చ.మీ.లలో) రీతిల్లో థీమ్‌లు

అడిక్‌మెట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ 3000 ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ 

యాప్రాల్‌ కల్యాణ్‌ సులోచన ఎన్‌క్లేవ్‌ 8000 స్వచ్ఛత 

యాప్రాల్‌ జేజేనగర్‌ 5000 జురాసిక్‌ 

యాప్రాల్‌ శ్రీకృషి ఎన్‌క్లేవ్‌ 5000 పాట్రియాటిక్‌ 

యాప్రాల్‌ షాయిలీ గార్డెన్స్‌ 4300 స్వచ్ఛత 

యాప్రాల్‌ జీకే హైట్స్‌ 4100 వాటర్‌ హార్వెస్టింగ్‌

అన్ని జోన్లు కలిపి మొత్తం 750709

అందుబాటులోకి వచ్చిన థీమ్‌ పార్కులు..

శేరిలింగంపల్లిలో డాగ్‌ పార్కు

కిషన్‌బాగ్‌ పార్కు

మీరాలం లేక్‌ పార్కు

శేరిలింగంపల్లి పంచతత్వ పార్కు

మలక్‌పేట దివ్యాంగుల పార్కు

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 36, ట్రాన్సిట్‌, ఫ్రూట్‌ థీమ్‌లు


logo