శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 13, 2020 , 07:16:09

విహంగ విహారం..

విహంగ విహారం..


హైదరాబాద్  : ‘వింగ్స్‌ ఇండియా’ విహంగ ప్రదర్శన అలరించింది. ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత ప్రభుత్వం- పౌర విమానయాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో  బేగంపేట ఎయిర్‌పోర్టులో నిర్వహించిన ‘వింగ్స్‌ ఇండియా - 2020’ ప్రదర్శన  ఆకట్టుకుంది. ఒకేసారి రెండు, మూడు విహంగాలు  ఆకాశంలో సందడి చేశాయి.  సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ వాణిజ్యపరమైన సదస్సులకు విచ్చేసిన అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులను ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. గురువారం ప్రారంభమైన వింగ్స్‌ ఇండియా విహంగ ప్రదర్శన మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నది. ‘ఫ్లయింగ్‌ ఫర్‌ ఆల్‌' థీమ్‌తో నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు, ఎయిర్‌ షోలు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 


 విహంగాల స్టాళ్లు.. ప్రదర్శనలు..

ఎరోనాటిక్స్‌, స్పేస్‌, ట్యాంకర్‌, కంబాట్‌ రవాణా, మిషిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, అంతర్జాతీయ అగ్రగామి సంస్థ ఎయిర్‌ బస్‌  ఆధ్వర్యంలో కొనసాగుతున్న విమానాల ప్రదర్శన, హెలికాప్టర్లు, పౌర, మిలటరీ రోటార్‌ క్రాఫ్ట్స్‌ మొదలైన విహంగాలకు సంబంధించిన విభాగాలు, అవి పని చేసే విధానాలు తెలిపేలా ప్రదర్శన గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో వందకు పైగా స్టాళ్లు ఉన్నాయి. ప్రదర్శనలో పైలట్‌ శిక్షణ, ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, ఏవియేషన్‌ విద్య, పౌర విమానయానంలో ప్రపంచ వ్యాప్త వాణిజ్యం, ప్రాంతీయ విమానయానంలో లాభదాయకంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ పని తీరు తదితర అంశాలను ఆవిష్కరించేలా ప్రదర్శన సాగింది. ఇంకా ఈ ప్రదర్శన అంతర్జాతీయ స్థాయి విమానయానం, అంతరిక్షం మహిళల పాత్ర, భారత విమానయానంలోనూ మహిళా పైలట్‌ల పాత్ర, సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష ప్రయోగశాల, పవన్‌ హన్స్‌ సంస్థ ,  భారతీయ విమాన అకాడమీ  సేవలను వివరిస్తున్నది.


ఆకట్టుకున్న విన్యాసాలు..

ప్రదర్శనలో మొదటి రోజు బృందాల వారీగా వైమానిక ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలోఎయిర్‌ షో జరిగింది. అనంతరం, మార్క్‌ జెఫ్పెరీ బృందం  మరో  షో నిర్వహించింది. తర్వాత మరో మారు ఆ రెండు బృందాలు  వైమానిక ప్రదర్శనలు నిర్వహించాయి.  


logo