బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Aug 03, 2020 , 23:06:39

ఫుట్‌పాత్‌ వ్యాపారులకు న్యాయం చేస్తా

ఫుట్‌పాత్‌ వ్యాపారులకు న్యాయం చేస్తా

 మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మారేడ్‌పల్లి : ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారికి తగిన విధంగా న్యాయం జరిగేలా చూస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బాటా వరకు చేపట్టిన వైట్‌ టాపింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తయి ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 

ఈ సందర్భంగా సోమవారం ఫుట్‌పాత్‌ వ్యాపారులతో మోండా మార్కెట్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు తొలిగించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపడుతున్నదని అన్నారు. రోడ్లపై , పుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంతమంది వ్యాపారులు ఉన్నారు, వారికి ఎంత స్థలం అవసరమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మోండా మార్కెట్‌లోని బండిమెట్‌ ప్రాంతంలో రూ. 12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌ ఆకుల రూపతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఉప కమిషనర్‌ ముకుందరెడ్డి వాటర్‌వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ శ్రీనివాస్‌, వెటర్నరీ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ రవి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆకుల హరి, నాగులు పాల్గొన్నారు.