శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 21, 2020 , 10:08:14

ప్రియుడి మోజులోనే హత్య

ప్రియుడి మోజులోనే హత్య

  • ప్రేమించి పెండ్లి చేసుకున్నారు..
  • కొంతకాలానికి మరొకరితో వివాహేతర సంబంధం
  • విషయం తెలియడంతో.. పడుకున్న భర్త ముఖంపై దిండుపెట్టి దారుణం..
  • ఆపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడని నాటకం
  • వివాహితతోపాటు ఆమె ప్రియుడు అరెస్ట్‌

చాంద్రాయణగుట్ట  : ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిం ది. ఈ కేసులో నిందితురాలితోపాటు ఆమెకు సహకరించిన ప్రియుడి ని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ వివరాల ప్రకారం..చాంద్రాయణగుట్ట ఇందిరానగర్‌కు చెందిన మహ్మద్‌ నసీర్‌(31), గౌసియా (27)లు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.  మహ్మద్‌ నసీర్‌  గగన్‌ఫహాడ్‌ వద్ద ఓ పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడు. కాగా.. ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి 12.30నిమిషాల సమయంలో గౌసియా బేగం .. అత్త మరియా బేగం ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి నసీర్‌ గొంతు నుమిలి హత్య చేయడానికి ప్రయత్నించాడని, అంతేకాకుండా తనపట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. వెంటనే ఆమె వెళ్లి చూడగా అపస్మారకస్థితిలో ఉన్న నసీర్‌ను మిధాని సమీపంలోని ఒవైసీ వైద్యశాలకు తీసుకెళ్లారు. నసీర్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. అయితే.. మృతిపై అనుమానం ఉంద ని మృతుడి తల్లి మరియా బేగం, సోదరుడు మహ్మద్‌ గౌస్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నసీర్‌ను భార్య గౌసియా బేగం హత్య చేసిందని తేలింది. గౌసియా.. షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌ (22) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది భర్తకు తెలియడంతో అతడిని చంపాలని పథకం పన్నింది... ఇందులో భాగంగా పడుకున్న భర్త ముఖంపై దిండుపెట్టి గౌసియా చంపేసింది. ఇందుకు ఆమె ప్రియుడు సహకరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గౌసియాతోపాటు, ఆమె ప్రియుడును అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.