ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 08, 2020 , 23:46:44

స్వాగతం అదిరేలా.. ఆహ్లాదం పంచేలా

స్వాగతం అదిరేలా.. ఆహ్లాదం పంచేలా

ఎల్బీనగర్‌ ముఖద్వారానికి సొబగులు  

విజయవాడ- హైదరాబాద్‌ రహదారిపై సుందరీకరణ 

చింతలకుంట చెక్‌ పోస్టు -రింగ్‌రోడ్డు చౌరస్తా వరకు పనులు

సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో పైలట్‌ ప్రాజెక్టు

సైక్లింగ్‌ ట్రాక్‌.. ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం.. అందమైన ఫుట్‌పాత్‌లు.. కలర్‌ఫుల్‌ డివైడర్లు.. ఇలా విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారి ముస్తాబవుతున్నది. నగరానికి వచ్చేవారికి అదిరిపోయేలా స్వాగతం పలికేందుకు ఎల్బీనగర్‌ ముఖద్వారం సరికొత్తగా వన్నెలద్దుకుంటున్నది. పైలట్‌ ప్రాజెక్టు కింద సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో చింతలకుంట చెక్‌పోస్టు నుంచి ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తా వరకు  అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. -ఎల్బీనగర్‌

సకల హంగులతో..

ఎల్బీనగర్‌ ముఖద్వారం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సర్వాంగ సుందరంగా దర్శనమివ్వనున్నది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మొదలుకుని శ్రీకాకుళం జిల్లాల వారు హైదరాబాద్‌ నగరానికి ఈ రహదారి మీదుగానే  వస్తుంటారు. జాతీయ రహదారి సుందరీకరణలో భాగంగా ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట చెక్‌పోస్టు వరకు ఇరువైపులా రోడ్డుపై అక్రమ నిర్మాణాలు, పార్కింగ్‌ను పూర్తిగా తొలగిస్తున్నారు. జాతీయ రహదారిపై  డివైడర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇరువైపులా సర్వీస్‌రోడ్డుకు మధ్య, రహదారికి చివరిలో ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే ఫుట్‌పాత్‌ల మధ్యలో ఆహ్లాదకరంగా ఉండేలా పెద్ద చెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 

చార్జింగ్‌ పాయింట్లు.. 

జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డుకు మధ్యలో ఉండే పుట్‌పాత్‌పై ఆహ్లాదాన్ని పంచడం కోసం పెద్ద పెద్ద చెట్లను నాటడంతో పాటు పలు ప్రాంతాల్లో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. బెంచీలు ఉన్న చోట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తారు. అలాగే ఎలక్ట్రికల్‌ కార్లను చార్జింగ్‌ చేసుకునేందుకు కూడా సదుపాయం ఉంటుంది. డివైడర్లు, ఫుట్‌పాత్‌లను ముచ్చటగొలుపే రంగులతో తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా జాతీయ రహదారిని అద్భుతంగా మార్చేస్తున్నారు. భవిష్యత్తులో  చింతలకుంట నుంచి హయత్‌నగర్‌ వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల వరకు జాతీయ రహదారిని సైతం అందంగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

సైక్లింగ్‌ ట్రాక్‌ కూడా..

ఆరోగ్యం కోసం వ్యాయామం, వాకింగ్‌తో పాటు సైక్లింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి- సర్వీస్‌రోడ్డుకు మధ్యలో నిర్మించే ఫుట్‌పాత్‌లో ప్రత్యేకంగా సైక్లింగ్‌ కోసం ట్రాక్‌ను కూడా రూపొందిస్తున్నారు. 

అద్భుతంగా  జాతీయ రహదారి..

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు రూ. 2.50 కోట్లతో చింతలకుంట చెక్‌పోస్టు నుంచి ఎల్బీనగర్‌ వరకు సుందరీకరణ చేపట్టాం. భవిష్యత్‌లో చింతలకుంట నుంచి హయత్‌నగర్‌ వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల వరకు అభివృద్ధి చేస్తాం. ఎల్బీనగర్‌ నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తాం.  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో వేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆటోనగర్‌ డంపింగ్‌యార్డు, బీఎన్‌రెడ్డినగర్‌ భూముల రిజిస్ట్రేషన్‌ సమస్యలపై కూడా కసరత్తులు చేస్తున్నాం.

- దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే,

ఎంఆర్‌డీసీ చైర్మన్‌ జాతీయ రహదారికి హంగులు 

ఎల్బీనగర్‌ నుంచి చింతలకుంట చెక్‌పోస్టు వరకు జాతీయ రహదారిపై సుందరీకరణ పనులు చేపట్టాం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చొరవ తీసుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. రహదారి సుందరీకరణతో ఎల్బీనగర్‌ నియోజకవర్గం ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది.

- జిట్టా రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్‌, వనస్థలిపురం


logo