బుధవారం 23 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:29:13

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

 జైకాలైన్ల అనుసంధానంపై చర్చ

 బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం

కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌  బోర్డు పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. బోర్డు పరిధిలో తాగునీటి సదుపాయం మెరుగుపరచడంతో పాటు, నీటి పొదుపు, డ్రైనేజీ వంటి సమస్యలపై కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌, ఎస్‌బీ రిటైర్డ్‌ డైరెక్టర్‌, సెంటర్‌ ఆఫ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ముఖ్య అధికారి(కడ్స్‌) విజయ్‌కుమార్‌తో పాటు బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి, వాటర్‌ వర్క్స్‌ విభాగం అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ చేసిన సూచనలు, సలహాలతో పాటు నీటి సామర్థ్యం పెంపు, నీటి నిల్వ చేసుకునే సదుపాయం, జైకాలైన్ల అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ కంటోన్మెంట్‌లో నీటి సరఫరాను పెంచడం, నీటిని నిల్వ చేసుకునే విధంగా రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు జైకాలైన్‌ పైపులైన్‌ వ్యవస్థలో మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్షం నీటిని ఒడిసి పట్టే విధంగా ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటి సరఫరా పెంచేలా చూడడంతో పాటు, టారిఫ్‌ తగ్గింపునకు తమ వంతు కృషి చేస్తామన్నారు.  వచ్చే బోర్డు మీటింగ్‌లో ప్రతిపాదనలు పెడుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రాజ్‌కుమార్‌, ఇక్బాల్‌, శషాంక్‌ పాల్గొన్నారు.


logo