గురువారం 28 జనవరి 2021
Hyderabad - Aug 19, 2020 , 00:06:16

మౌలిక వసతులు కల్పిస్తాం

మౌలిక వసతులు కల్పిస్తాం

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కేపీహెచ్‌బీ డివిజన్‌లో పర్యటన

హైదర్‌నగర్‌ , ఆగస్టు 18 : నిత్యం ప్రజలతో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తున్నట్లు  కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరిస్తూ.. మౌలిక వసతుల కల్పనతో  ప్రజలకు మరింత సౌకర్యం కల్పించటమే తన లక్ష్యమన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ డివిజన్‌ మలేషియన్‌ టౌన్‌ షిప్‌లో సమస్యలను పరిశీలించటంతో పాటు, లోథా అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు  పాల్గొన్నారు. మలేషియన్‌ టౌన్‌ షిప్‌ వన్‌ సిటీ మధ్యలో ఉన్న రోడ్డులో వర్షం నీరు నిలుస్తుండటంతో ఎదురవుతున్న ఇబ్బందులు.. వర్షపు నీటిలో డ్రైనేజీ  నీరు కలుస్తున్నాయని కాలనీవాసులు ఎమ్యెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన.. మలేషియన్‌ టౌన్‌ షిప్‌లోని వాటర్‌ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వాటర్‌ వర్స్‌ అధికారులకు తెలిపారు. వన్‌ సిటీ ఎదుట వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా.. వర్షపు నీటి డ్రైన్‌ను ఏర్పాటు చేయాలని.. సీసీ రోడ్డు నిర్మించి ఇరువైపులా ఫుట్‌పాత్‌ , కరెంటు పోల్స్‌ , విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌-1  ట్రినిటీ చర్చి వద్ద నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించి, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా  ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.  కార్పొరేటర్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


logo