శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 23, 2021 , 06:16:15

ఇంకెవ్వరికీ..అలా కావొద్దని..

ఇంకెవ్వరికీ..అలా కావొద్దని..

  • రోడ్డుపై గుంతలు పూడ్చి.. ప్రమాదాల నివారణకు ప్రయత్నం
  • ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌'తో మార్పునకు శ్రీకారం
  • వారాంతంలో సేవా కార్యక్రమాల నిర్వహణ 
  • సమాజహితంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు  

కొండాపూర్‌, ఫిబ్రవరి 22 : కండ్ల ముందు జరిగిన ఓ ఘటన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కార్తీక్‌ మనసును తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా తన వంతు ఎదైనా ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చింది. అలా ఫేస్‌బుక్‌ వేదికగా  ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌' గ్రూపు రూపొందించాడు. తనలాగే సేవలందించాలనుకున్న వారంతా అందులో సభ్యులుగా చేరారు. వారాంతంలో ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్నారు. 

ఆ సంఘటనతోనే...

రాజన్న సిరిసిల్లకు చెందిన కార్తీక్‌ బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఆఫీసుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడు పడి మృతి చెందడం వేదనకు గురిచేసింది. గుంతలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే నిండుప్రాణం బలైపోయిందని భావించిన కార్తీక్‌.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవద్దని సంకల్పించాడు. స్నేహితులతో కలిసి 2017లో ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌' గ్రూపును ప్రారంభించాడు.  సభ్యులతో కలిసి రహదారులపై గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.

వారాంతంలో.. 

వారం రోజుల పాటు విధులతో కుస్తీలు పట్టే టెకీలు.. వారాంతంలో స్వచ్ఛందంగా సమస్యల పరిష్కారానికి ముందుంటున్నారు. మొదటగా రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే కార్యక్రమంతో ప్రారంభమైన ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌' సభ్యుల సేవలు..రానురాను ఇతర సమస్యలపై దృష్టి సారించారు. బస్‌ స్టాపుల్లో గోడలకు అందమైన చిత్రాలతో రంగులు వేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచడం, విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టులకు సంబంధించిన పెయింటింగ్స్‌ రూపంలో అందించడం వంటివి చేస్తున్నారు.  

మూగ జీవాలను దత్తత తీసుకొని..

కరోనా విపత్కర సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. అంతేకాదు మూగ జీవాలను దత్తత తీసుకొని అవసరమైన వారికి వాటిని అందిస్తున్నారు. వాటికి షెల్టర్లు సైతం కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని సౌకర్యాలను కల్పించారు. హరితహారంలో భాగంగా సిరిసిల్లలో 

మియావాకి విధానంలో మొక్కలు నాటి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 

వీకెండ్‌ అనగానే మనకు గుర్తొచ్చేవి పార్టీలు..సరదా ట్రిప్పులు..లాంగ్‌ డ్రైవ్‌లు. అలాంటి వీకెండ్‌లో కొంతమంది టెకీలు చేతనైనంత సాయం చేస్తున్నారు. శనివారం, ఆదివారం సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తున్నారు. రోడ్లపై ప్రాణాలు తీసే గుంతలను పూడ్చేస్తున్నారు. బస్‌స్టాపుల గోడలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. సర్కారీ స్కూళ్లలో పారిశుధ్యం మెరుగుపరుస్తున్నారు. మూగజీవాలను దత్తత తీసుకొని ఆలనాపాలనా చూస్తున్నారు. గతంలో చూసిన ఓ విషాదఘటన ఇంకెవ్వరి జీవితంలో మళ్లీ చోటు చేసుకోవద్దనే ఓ ఉదాత్తమైన ఆలోచనతో.. ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌' పేరుతో నడుం బిగించారు.

మా వంతుగా..

సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కంటే ముందుగానే చర్యలు తీసుకుంటే జరిగే మేలు చాలా ఎక్కువ. బెంగళూరులో చూసిన సంఘటన మరోసారి జరుగకూడదనే ‘వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌'ను ప్రారంభించా. బృందంగా సమస్యల పరిష్కారానికి మా వంతుగా ముందుకు సాగుతున్నాం. సమాజ సేవకు ముందుకు వస్తున్న సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్ముందు ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.  -కార్తీక్‌, వీ కెన్‌ మేక్‌ ఏ ఛేంజ్‌ ఫౌండర్‌

VIDEOS

logo