బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 13, 2020 , 00:08:44

ప్రజలకు మనమే రోల్‌ మోడల్‌

ప్రజలకు మనమే రోల్‌ మోడల్‌

అధైర్యం వద్దు.. ఆత్మైస్థెర్యమే ఆయుధం

కరోనాను జయించినవారు ప్లాస్మాదానం చేయాలి

విధుల్లో చేరిన 220మంది పోలీసులకు స్వాగతం పలికిన సీపీ అంజనీకుమార్‌

చార్మినార్‌ : కరోనా అనగానే అధైర్య పడకుండా.. ఆత్మైస్థెర్యాన్ని ప్రదర్శిస్తూ వైరస్‌పై విజయం సాధించేందుకు మానసికంగా సిద్ధం కావాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.  కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరుతున్న 220మంది సిబ్బందికి బుధవారం పాతనగరంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సీపీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ మార్చి నుంచి నగర పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూనే కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో యుద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా 1500లకు పైగా పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడ్డారని వివరించారు. ప్రజలను స్వరాష్ర్టాలకు తరలించే క్రమంలో నగర పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. పోలీస్‌ విభాగంలోని ప్రతి ఒక్కరి కృషి, పట్టుదలతో నగర పోలీస్‌ విభాగం దేశవ్యాప్తంగా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 16వ స్థానంలో కొనసాగుతున్నామంటే పోలీస్‌ కుటుంబ సభ్యుల ఘనతేనని స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకుని విధుల్లో చేరిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. 

ప్లాస్మా దాతలు.. మన పోలీసులు

దక్షిణ మండల పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్ల వారీగా సుమారు 286మంది పోలీసు కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ బారిన పడ్డారని, ప్రస్తుతం 220 మంది సిబ్బంది పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి విధుల్లో చేరారని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు 120మంది పోలీసులు ప్లాస్మా దానంచేసి.. ప్రాణదాతలుగా గుర్తింపు పొందారని హర్షం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్క సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ సీపీ డీఎస్‌ చౌహాన్‌తోపాటు అడిషనల్‌ సీపీ ఎస్బీ తరుణ్‌జోషి, చార్మినార్‌, మీర్‌చౌక్‌ ఏసీపీలు అంజయ్య, ఆనంద్‌లతోపాటు పలు పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

కరోనా సోకిన పోలీసు సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ప్రతి రోజు దవాఖానలు, హోం క్వారంటైన్‌లో ఉన్న పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారిలో మనోధైర్యం నింపాం. పోలీస్‌ కుటుంబంలో ఎవరైనా కరోనా భారిన పడితే వారిని దవాఖానకు తరలించడానికి పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో 24 గంటల పాటు రెండు వాహనాలు, డ్రైవర్లు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తించుకోవాలి. 

- సీపీ అంజనీకుమార్‌

ధైర్యంగా వచ్చి.. ప్లాస్మా ఇవ్వండి 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భయం వీడండి.. అనుమానాలకు పాతర వేయండి.. సందేహాలను తరిమి కొట్టండి.. ధైర్యంగా వచ్చి కరోనా విజేతలు ప్లాస్మా దానం చేయండని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపునిస్తున్నారు. మీరు ఇచ్చే ప్లాస్మా ఇద్దరీ జీవితాలను నిలుపుతుందన్నారు. 72 గంటల్లో తిరిగి మీ ఒంట్లో వచ్చేస్తుందంటూ సైబరాబాద్‌ పోలీసులు కరోనా విజేతలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బుధవారం సైబరాబాద్‌ పోలీసుల వద్ద 28 మంది రిజిస్టర్‌ చేసుకుని ప్లాస్మా దానం చేశారు. ఇప్పటివరకు మొత్తం 338మంది ప్లాస్మా దానం చేశారు. వీరందరూ చేసిన ప్లాస్మా దానంతో 520మంది అత్యవసర, విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఆరోగ్యవంతంగా మారారు.

సీపీ ధైర్యం చెప్పారు..

అధైర్య పడకుండా హోం క్వారంటైన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోని కరోనా నుంచి బయటపడ్డాం. సీపీ మహేశ్‌భగవత్‌ కరోనా వచ్చిన వారిని పలుకరిస్తూ ధైర్యాన్ని నింపారు. ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తూనే.. కావల్సిన మెడికల్‌ కిట్లు అందజేశారు. ఈ రోజు మళ్లీ విధుల్లో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

- ఎం. శంకర్‌, రాచకొండ ట్రాఫిక్‌ ఏసీపీ

ఇంటికి మెడికల్‌ కిట్టు పంపించారు

కరోనా రాగానే ముందు చాలా భయంగా అనిపించింది. సీపీ కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి నా వివరాలు తీసుకున్నారు. ఇంటికి మెడికల్‌ కిట్టు పంపించారు. దీంతో నాలో మనోధైర్యం వచ్చింది. సీపీ సార్‌ ఇచ్చిన సూచనలు పాటించి జాగ్రత్తగా వ్యవహరించా. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది.

- పి. అశోక్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ, ఎల్బీనగర్‌   

ఆత్మైైస్థెర్యం కోల్పోవద్దు 

నాకు కరోనా వచ్చిన తరువాత మా భార్య పిల్లలకు వచ్చింది. ముందు చాలా భయపడ్డాం.. తరువాత సీపీ సార్‌ మాకు ఫోన్‌ చేసి మంచి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. ఆత్మైస్థెర్యం నింపారు.  మెడికల్‌ కిట్టు అందజేశారు. మేము ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. 

- వెంకటయ్య, ఇన్‌స్పెక్టర్‌, వనస్ధ్దలిపురం

అధికారులు మనో ధైర్యం నింపారు..

నాకు జూన్‌ 23న పాజిటివ్‌ వచ్చింది. అదే సమయంలో నా కూతురికి కూడా కరోనా సోకింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాం.  సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న పోలీస్‌ అధికారులు మనోధైర్యం నింపారు. మీకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పించారు. వైద్యుల సలహాలతోపాటు పోలీస్‌ అధికారులు పరిస్థితిని తెలుసుకుంటూ సహకరించారు.

- ప్రమోదిని, ఏఎస్సై, హుస్సేనిఅలం

సంతోషంగా ఉంది..

కరోనా సోకితే అధైర్యపడవద్దనే సలహాలను చాలామందికి అందించా. అదే పరిస్థితిలోకి నేను వెళ్లే సరికి ఒకింత భయమేసింది. జూన్‌ నెలలో ఒంట్లో నలతగా అనిపిస్తే టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ వచ్చింది.  హో క్వారైంటెన్‌లో చికిత్స తీసుకుంటున్న సమయంలో నగర పోలీస్‌ అధికారుల నుంచి ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. కరోనా అంటే బంధువులు సైతం దూరంగా వెళ్తున్న సమయంలో పోలీస్‌ అధికారులు అండగా నిలిచారు. తిరిగి విధులకు హాజరవుతున్నందుకు సంతోషంగా ఉంది. 

- నాయుడు. ఎస్సై, హుస్సేనిఅలం 

వైద్యులు ధైర్యం చెప్పారు

ఆరోగ్యం క్షీణించడంతో కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ వచ్చింది. మధుమేహం చికిత్స తీసుకుంటున్న నేను మనోధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా సిద్ధమయ్యా. అంతలో నా భార్య అనితకు సైతం పాజిటివ్‌ వచ్చింది. ఎస్సార్‌నగర్‌ పోలీసుల సహకారంతో ఛాతి దవాఖానలో చేరాం. అక్కడి వైద్యులు ఆప్యాయంగా పలకరిస్తూ చిన్న జ్వరమే తగ్గిపోతుందంటూ ధైర్యం చెప్పారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జీ చేశారు. 

- రామేశ్వర్‌. హెడ్‌ కానిస్టేబుల్‌  


logo