బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Aug 14, 2020 , 00:30:07

ఇంట్లోనే ఉన్నాం.. అయినా వచ్చింది..

ఇంట్లోనే ఉన్నాం.. అయినా వచ్చింది..

ఒకే కుటుంబంలో 11 మందికి పాజిటివ్‌

ఇంట్లోనే ఉంటూ.. కరోనాపై విజయం

డాక్టర్ల సూచనలతో ధైర్యం వచ్చింది

సలహాలు పాటించడంతో.. 

    మామూలు స్థితికి

కరోనా ఇప్పుడు సాధారణ విషయం. ఎవరికి ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా వచ్చినా ఇప్పుడు ఏ మాత్రం ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్ల సూచనలు పక్కగా పాటిస్తే కరోనాను జయించడం పెద్ద కష్టమేమికాదు. ఇంట్లోనే ఉంటూ కరోనాను జయించిన వారే ఎక్కువ. అనవసరమైన ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా డాక్టర్‌ సూచనలు పాటిస్తే అత్యధిక శాతం మందికి ఇబ్బందులు ఏమీ ఉండవనేది స్పష్టమవుతున్నది. కరోనా సోకి నయమైన వారే ఈ మాట చెబుతున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని ఖాజానగర్‌లో ఉండే ఆరీఫ్‌ సయీద్‌ది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ములు కలిసి ఉండే ఆ ఇంట్లో మొత్తం 14మంది ఉంటారు. ఆరీఫ్‌ సయీద్‌(51) టీచర్‌గా పని చేసి ఇంట్లోనే ఉంటున్నారు. గత నెల 4న జ్వరం రావడంతో దగ్గర్లోని డాక్టర్‌ వద్దకు వెళ్లారు. అయినా తగ్గకపోవడంతో అనుమానం వచ్చింది. రెండు రోజుల తర్వాత టెస్టు చేసుకుంటే కరోనా అని తేలింది. ఆరీఫ్‌ తమ్ముడు ఆసిఫ్‌ సయీద్‌(41)తోపాటు అన్నదమ్ముల భార్యాపిల్లలు కలిపి కుటుంబంలోని 11మందికి వైరస్‌ సోకింది. వైరస్‌ సోకిన వారిలో 51 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వరకు ఉన్నారు. వెంటనే యశోద హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ ఎంవీ రావును సంప్రదించారు. ఆరీఫ్‌కు కొంచెం ఇబ్బంది కావడంతో దవాఖానలో చేరాడు. మిగిలిన పది మంది ఇంట్లోనే ఉండి డాక్టర్‌ సూచనలు పక్కగా పాటించారు. పది రోజులు, రెండు వారాల తేడాతో అందరూ కరోనాను జయించారు. ఈలోపు ఆరీఫ్‌ సైతం దవాఖాన నుంచి డిచ్చార్జీ అయ్యాడు. కరోనా అని తెలిసి చాలా భయపడ్డామని డాక్టర్‌ సూచనలను కచ్చితంగా పాటించడంతో అందరం మామూలుగా అయ్యామని ఆసిఫ్‌ సయీద్‌ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. 

ధైర్యమే పెద్ద మందు

‘లాక్‌డౌన్‌ నుంచి మేం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. పిల్లలను కూడా బయటికి పోకుండా అవగాహన కల్పించాం. అయినా మా అన్నయ్యకు జ్వరం వచ్చింది. తగ్గకపోవడంతో టెస్టు చేయిస్తే కరోనా అని తేలింది. తర్వాత మూడు రోజులకు మా వదినకు, మరో మూడు రోజులకు నా భార్యకు, ఆ తర్వాత నాకు, పిల్లలకు వరుసగా ఇలాగే అయ్యింది. మా అన్నయ్యకు కొంచెం ఇబ్బంది కావడంతో దవాఖానలో చేరారు. డాక్టర్‌ ఎంవీ రావు, ఆయన వైద్య బృందం సూచనలతో మేమంతా ఇంట్లోనే ఉన్నాం. సమయానికి మందులు వేసుకున్నాం. కషాయం తాగడం, ఆవిరి పట్టడం చేశాం. డాక్టర్‌ చెప్పిన ప్రకారం ఆహారం తీసుకున్నాం. ఒక్కొక్కరుగా అందరికీ కరోనా లక్షణాలు పోయాయి. పిల్లలకు త్వరగా నయమైంది. గరిష్టంగా రెండు వారాల్లోనే అందరం సాధారణ స్థితికి వచ్చాం. కరోనా అని తేలినప్పుడు బాగా భయపడ్డాం. ఎలా ఉంటుందో అని ఆలోచించాం. డాక్టర్‌ సూచనలతో ధైర్యం వచ్చింది. ధైర్యంగా ఉండి కరోనాను జయించాం. కరోనా సోకగానే ఎవరూ ఆందోళనపడవద్దు. ధైర్యంగా ఉండాలి. ఇదే పెద్ద మందు’ అని ఆసిఫ్‌ వివరించారు. logo