శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Oct 29, 2020 , 08:38:06

తొలిగిన వరద నీటి సమస్య

తొలిగిన వరద నీటి సమస్య

బన్సీలాల్‌పేట్‌: బోయిగూడ ఆర్‌యూబీ.. వర్షాకాలం లో వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది.. ఇక భారీ వర్షాలు వస్తే నడుంలోతు నీటితో ఆర్‌యూబీ రాకపోకలకు సాధ్యం కాదు. న్యూబోయిగూడ నుంచి ఇటు మోం డా మార్కెట్‌ వైపు నుంచి రాకపోకలు సాగించాలంటే ఈ దారే ఏకైక మార్గం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వర్షా కాలం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఆర్‌యూబీ కింద నిలిచిపోయే వరదనీటితో రాకపోకలు అత్యంత క్లిష్టంగా మారుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో మంత్రి తలసాని చొరవతో ఆర్‌యూబీ కింది నుంచి వెళుతున్న నాలాను ఆధునీకరించడంతో సమస్యకు పరిష్కారం లభించినట్టయ్యింది. 

పైపులైన్‌ వ్యవస్థను ఆధునీకరించడంతో..

ముఖ్యంగా పాత గాంధీ దవాఖాన నుంచి వచ్చే వరదను న్యూబోయిగూడ వైపు వెళ్లే మార్గంలో గతంలో ఉండే పైపులైన్‌ వ్యవస్థను ఆధునీకరించడంతో వరదనీరు సాఫీగా వెళుతున్నది. దీంతో పాటు ఆర్‌యూబీ కింద ఎప్పటికప్పుడు వరదనీటి పైపులైన్ల నిర్వహణ పనులు జరుగుతుండడంతో ఎప్పటి పూడికలు అప్పుడు తొలగిపోతున్నాయి. దీంతో ఇటీవలి వరుస వర్షాలకు ఆర్‌యూబీ కింద వరదనీటి నిల్వ లేదు. దశాబ్దాల తరబడి బోయిగూడ ఆర్‌యూబీ కింద నెలకొన్న వరద నీటి సమస్యను పరిష్కరించాలని మొత్తుకున్నా.. చలనం లేకుండా పోయింది. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆర్‌యూబీకి వరద తాకిడి లేకుండా చేయాలన్న సంకల్పంతో సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇక్కడి నాలా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయడంతో వాహనదారులు ఇప్పుడు ఎంతటి వర్షాల్లో కూడా నిస్సంకోచంగా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. 

మంత్రి చొరవతో శాశ్వత పరిష్కారం

తాను పుట్టి పెరిగిన పరిసరాలు కావడంతో ఇక్కడి సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బోయిగూడ రైల్వే బ్రిడ్జి సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలను నిర్వహించారు. పాత గాంధీ దవాఖానను పూర్తిగా తొలగించి, అక్కడ మెట్రో రైల్వే స్టేషన్‌ నిర్మించడంతో నాలా నుంచి నీరు సాఫీగా వెళ్లలేకపోవడంతో సమస్య ఉత్పన్నమైందని గుర్తించి పరిష్కార మార్గాలను సూచించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో వాన నీరు నిలిచిపోయే సమస్య పూర్తిగా తొలగిపోయింది. వాహనదారులు, పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు. ఇందుకు మంత్రి తలసాని చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి

బన్సీలాల్‌పేట్‌, మోండా మార్కెట్‌ డివిజన్ల నడుమ ఉన్న బోయిగూడ రైల్వే బ్రిడ్జి సమస్యను స్వయంగా పరిశీలించాను. చిన్నపాటి వానకే పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సమస్యకు మూలం గుర్తించి, బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులకు ఇచ్చిన సూచనల మేరకు చేపట్టిన పనులతో ఇప్పుడు సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. దాని పక్కనే బోయిగూడలో ప్రజల సదుపాయం కోసం కొత్తగా పార్కును కూడా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ఇలా మా ప్రభుత్వం ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధిలో సనత్‌నగర్‌ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాను.