గురువారం 28 మే 2020
Hyderabad - May 20, 2020 , 00:20:49

వంద ప్లాంట్లు దాటితే ‘ఎస్టీపీ’ తప్పనిసరి..

వంద ప్లాంట్లు దాటితే ‘ఎస్టీపీ’ తప్పనిసరి..

హైదరాబాద్  :  పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి శుద్ధిని పకడ్బందీగా నిర్వహించేందుకుగానూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారీ గృహ సముదాయాలు వాటి పరిధిలోని మురుగును శుద్ధి చేసిన తర్వాతనే విడుదల చేసేందుకు ప్రత్యేకంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ జీవో జారీ చేశారు. అపార్టుమెంట్లు, కాంప్లెక్స్‌లు, సంస్థలు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఇలా వంద ఫ్లాట్లు దాటినగానీ, పది వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న గృహ సముదాయాలు ప్రత్యేకంగా ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని కచ్చితమైన నిబంధన విధించారు. దీనిపై ఈ నెల ఐదో తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమీక్షలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ చర్యలు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ నిబంధనల అమలుకుగాను ప్రత్యేకంగా పర్యావరణ అమలు సెల్‌ (ఈఈసీ)ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హెచ్‌ఎండీ సీఐవో బి.హరినాథ్‌రెడ్డిని ఈ సెల్‌కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖలో ఈ సర్వీసు నోడల్‌ అధికారిగా కూడా వ్యవహరిస్తుండగా సెల్‌కు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతల్ని అప్పగించారు. నిబంధనల అమలుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు పూర్తి సమాచారాన్ని సెల్‌కు అందించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. సెల్‌ ఎప్పటికప్పుడు ఈ గృహ సముదాయాలకు ఎస్టీపీల ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు ఎస్టీపీల నిర్వహణ కూడా సజావుగా సంబంధిత యాజమాన్యాలు నిర్వహించేలా సెల్‌ పర్యవేక్షణ చేస్తుంది.


logo