గురువారం 21 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 07:09:30

ప్రజాస్వామ్య స్పూర్తిని చాటేందుకు ఓటేద్దాం రండి..

ప్రజాస్వామ్య స్పూర్తిని చాటేందుకు ఓటేద్దాం రండి..

ఓటు ప్రజాస్వామిక హక్కు. మనకు నచ్చిన పరిపాలకుడిని మనమే ఎన్నుకునే ఓ రాజ్యాంగబద్ధ్దమైన ఆయుధం. కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి.. 45 శాతం మించి పోలింగ్‌ నమోదు కావడం లేదు.ఉద్యోగులు, విద్యావంతులు, యువత, మేధావులు అత్యధికంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో సుమారు 60శాతం మంది ఓటర్లు పోలింగ్‌ రోజును ఏదో ప్రభుత్వ సెలవు దినంగా భావిస్తూ చాలా మంది ఓటర్లు గడపదాటడం లేదు. కనీసం ఈ సారైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఓటింగ్‌లో పాల్గొని 100శాతం పోలింగ్‌ నమోదు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతారని ఆశిద్దాం..

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటువేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిఢవింజేయాలి. ప్రజా స్వామ్యదేశంలో ఓటు పవర్‌ను సద్వినియోగం చేసుకుంటేనే ఆరోగ్యవంతమైన, విజయవంతమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. పోలింగ్‌ రోజున పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పండుగ సెలవుగా భావిస్తున్నారు.ముఖ్యంగా యువత, విద్యావంతులు అధికంగా ఉండే నగరంలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతుండటం విచాకరం. ఇది మంచి సంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యం బలపడేందుకు భవిష్యత్‌ను బాధ్యతగా నిర్మించుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేడు కొవిడ్‌ నిబంధనలు పాటించి ఓటు వేయాలి.- శ్వేతా మహంతి, కలెక్టర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా

ఓటు వేయడం మన బాధ్యత

ఓటు వేయడం మన బాధ్యత, నేడు జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో గ్రేటర్‌లో ఓటు హక్కు ఉన్న  ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎన్నికల కమిషన్‌ అన్ని  ఏర్పాట్లు చేసింది. మన హైదరాబాద్‌, రాష్ట్రం యొక్క శాంతి సౌభాగ్యం కోసం ఓటు వేయండి. ఓటర్లందరు మాస్కులు ధరించి, భౌతికదూరంతో పాటు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. -విజయ్‌ దేవరకొండ, సినిమా హీరో

మనం వేయాలి.. పక్కవాళ్లతో వేయించాలి

ఓటు వజ్రాయుధం లాంటిది. అందరికీ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించేందుకు గాను రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు. ఇలాంటి హక్కును ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదు. బాధ్యతాయుతమైన పౌరుగా ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. తాము పాల్గొనడమే కాకుండా, పక్కవాళ్లను చైతన్యపరిచి, వారిని సైతం ఓటింగ్‌లో పాల్గొనేట్లుగా చేయాలి. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా మనకు ఉన్న హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. - నోరి శ్రీనేశ్‌కుమార్‌, జిల్లా సైనిక సంక్షేమాధికారి

నేను ఓటేస్తాను.. మీరూ వేయండి

నేడు జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో నేను ఓటు వేస్తాను, నగరంలో ఓటు హక్కు ఉన్న పౌరులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటేయండి. ప్రజాస్వామ్యం బలపడేందుకు భవిష్యత్‌ను బాధ్యతగా నిర్మించుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయని వాళ్లకు ప్రశ్నించే హక్కు ఉండదు. మీరు ఓటు వేసి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలబడాలి.మీ చుట్టూ ఉన్నవాళ్లకు ఓటు విలువ తెలియజేసి వాళ్లందరు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. - విద్యాసాగర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా.

ఓటు ప్రజాస్వామిక ఆయుధం

ఓటు హక్కు దేశ పౌరుడికి లభించిన ప్రజాస్వామిక ఆయుధం. దేశ పౌరుడి విచక్షణకు, విజ్ఞానానికి, వివేచనకు ఓటు హక్కు ఒక మార్గం. ఇంత గొప్ప మేథో ఆయుధాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ పౌరులు సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేసి  నచ్చిన నాయకులను ఎన్నుకోవాలి. పోటీలో ఉన్న నాయకులు నచ్చకుంటే నోటా నొక్కొచ్చు. అంతే కానీ ఓటు వేయకపోవడం అంటే..దేశ ప్రగతిలో ఉన్న బాధ్యతను విస్మరించడమే.  - అశోక్‌కుమార్‌, రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌


logo