బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 06:45:06

కల్పవృక్షం.. కాపాడుకుందాం

కల్పవృక్షం.. కాపాడుకుందాం

  • కుల.. మత.. ప్రాంత.. అమీర్‌.. గరీబ్‌ భేదం లేకుండా ఉపాధి
  • కండ్ల ముందే కదలాడుతున్న కరోనా వైరస్‌ చేదు అనుభవాలు

హైదరాబాద్‌ మహానగరం నిరుద్యోగుల, చిరుద్యోగుల కలలు నిజం చేసే గొప్ప నగరం. చదివిన చదువుకు సరైన ఉద్యోగం, సంపాదన లభించక అనేక సమస్యలతో  సతమతమయ్యే వారికి నగరం గమ్యస్థానం. పేదల కడుపు నింపే కార్ఖానా. జీవితంలో ఎత్తుకు ఎదగాలనుకునేవారికి వెన్నుతట్టి అండగా నిలబడే నగరం. ఎన్నో  ఆశలు..ఆశయాలతో వచ్చే వారిని అమ్మలా ఆదరించి.. లక్షలాది మందికి అన్నపూర్ణగా కడుపునింపుతున్నది మన హైదరాబాద్‌. కుల, మత, బీద, గొప్ప ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తూ... అమ్మలా లాలిస్తున్న ఈ మహా నగరం కడుపులో విద్వేష చిచ్చు పుడితే.. భౌతికంగా నగరాన్ని మాత్రమే కాదు... కోట్లాది మంది ఉపాధికీ పెను ముప్పే . కరోనా చేదు అనుభవాలు కండ్ల ముందే కదలాడుతున్నా.. పచ్చని నీడలో చల్లగా ఉన్న ప్రాంతంలో మతతత్వ రూపంలో అగ్గి రాజేసే శక్తులు కాచుకు కూర్చున్నాయి.. వారికి ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాలి. ప్రశాంత పతాక  రెపరెపల్ని కాపాడుకోవాలి. మనకు జీవితాన్నిచ్చే, సంపదనిచ్చే కల్పవృక్షం ఏ చీకూ చింతా లేకుండా హాయిగా వర్ధిల్లేలా నిర్ణయాలు తీసుకోండి. 

 కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ నెలకు ఐదారు వేలు సంపాదించే ఓ సామాన్యుడు.. ఏటా లక్షల్లో వేతన ప్యాకేజీ తీసుకునే ఐటీ ఉద్యోగి.. బ్యూటీషన్‌గా నెలకు రూ.50వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే ఒక గృహిణి.. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక పారిశ్రామికవేత్త.. ఇలా ఒకరేమిటి! ఒకటేమిటి!! హైదరాబాద్‌లో లక్షలాది మంది అనేక రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. కుల, మత, ప్రాంత, బీద, బిక్కీ అనే తేడా లేకుండా అందరినీ ఆదరిస్తూ, లాలిస్తున్న ఈ మహా నగరం కడుపులో విద్వేష చిచ్చు పుడితే?! భౌతికంగా నగరాన్ని మాత్రమే కాదు.. కోట్లాది మంది ఉపాధిని దహించివేస్తుంది. ఆదమరిచి ఆ అగ్గికి సమిధలవుదామా? వేలికి సిరా అంటించుకొని అభివృద్ధికి విధాతగా మారుదామా? ఆలోచించండి... హైదరాబాద్‌ మహా నగర కల్పవృక్షం కలకాలం పచ్చగా ఉండేలా అడుగులు వేయండి. 

ఉపాధి ఔషధం

హైదరాబాద్‌లో ఔషధాల తయారీ పరిశ్రమల వేళ్లూనుకుంది. గ్రేటర్‌లో పరిధిలో  280 వరకు బల్క్‌డ్రగ్‌ ఫార్మా కంపెనీలు, మరో 200 వరకు కెమికల్‌ కంపెనీలు, మరో 300 వరకు ఫార్ములేషన్‌ యూని ట్లు ఉండగా, మన రాష్ట్రంతో పాటు 16 రాష్ర్టాలకు చెంది న 1.5 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. విదేశీ ఎగుమతుల్లో 20శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో 120 కొత్త పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నాలుగేండ్లలో సుమారుగా 100 బిలయన్ల పెట్టుబడులను నగరం ఆకర్షించగలిగింది.

ఐటీలో 5.82లక్షల మందికి ఉద్యోగులు.. 

దేశంలోనే అతి పెద్ద ఉద్యో గ, ఉపాధి అవకాశాల రంగమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)పై కొవిడ్‌ ప్రభావం మిగతా రంగాలతో పోల్చితే చాలా తక్కువే ఉంది. ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఉండడం తో అంతగా ఉద్యోగాల తొలిగింపు లేకుండాపోయింది. దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్‌ ఐటీ రంగంలో దాదాపు 5.82లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో వర్టికల్స్‌ వారీగా చూస్తే, ప్రోగ్రామింగ్‌ అండ్‌ ప్రాజెక్టు డెలప్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, టూరిజం వంటి వాటిలో టూరిజంపై పని చేసే ఉద్యోగులకు పని లే కుండాపోయింది. అదే సమయంలో హెల్త్‌కేర్‌ రంగానికి  పని పెరిగింది. 

10వేల హాస్టళ్లు.. 10లక్షల మందికి వసతి

దేశంలోనే హైదరాబాద్‌ మహానగరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇక్కడి వస్తున్నారు. అలాంటి వారికి ఇక్కడ 10వేల వసతి గృహాలు ఉన్నాయి. అధికంగా ఐటీ శిక్షణకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 2500 హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 9లక్షల నుంచి 10లక్షల మంది వరకు వసతి పొందుతున్నారు.

కడుపు నింపే కార్ఖానా

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : ప్రపంచ కార్మికులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలైన మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో సుమారు 10లక్షలకు పైగా కార్మికులు బతుకుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 1500 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలుండగా, వీటిలో సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని మొత్తం 4,635 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో సుమారు 4.5 లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 5,224 సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలుండగా, వీటిలో సుమారు 4.5లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. సొంత రాష్ర్టాలో ఉపాధి కరువై, భారంగా వచ్చిన లక్షలాది శ్రామికులను హైదరాబాద్‌ అన్నం పెడుతున్నది. లాక్‌డౌన్‌ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే, కార్మికుల నుంచి నయాపైసా తీసుకోకుండా వారి సొంత రాష్ర్టాలకు తెలంగాణ సర్కారు క్షేమంగా చేరవేసింది.

రవాణా కార్మికులకు సర్కారు భరోసా

హైదరాబాద్‌లో 60 లక్ష ల వాహనాలున్నాయి. ఆటో లు, క్యాబ్‌లు, లారీలు, డీసీఎం లు, ట్రాలీ, బస్సులపై ఆధారపడి సుమారు 4.30లక్షల మంది కార్మికులు బతుకుబండి నడిపిస్తున్నారు. కరోనాతో వాహనాలు రోడ్లెక్కక ఇంటికి పరిమితమయ్యా రు. ఫలితంగా నెలనె లా చెల్లించాల్సిన ఈఎంఐల భారం వారిపై పడింది. అయితే  తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలిచి, ఇటీవల రెండు త్రైమాసికాల వాహన మోటరు పన్ను రద్దు చేసింది. ఈ ఆరేండ్లలో రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్‌ ట్రాలీలకు పన్ను మినహాయింపునిచ్చింది. రాష్ట్రం ఏర్పడిన జూన్‌ రోండో తేదీ నాటికి ఈ వాహనాలకు సంబంధించి పేరుకుపోయిన రూ.76.26 కోట్ల పన్ను బకాయిలు రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రేటర్‌లోని లక్షలాది వాహన యజమానులు లాభపడ్డారు. 

క్యాబ్‌లు, ఆటోలకు డిమాండ్‌..

1.40లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లు, 1.20 లక్షల మంది ఆటో డ్రైవర్లున్నారు. నగరం నలుదిశలా అభివృద్ధి చెందుతుండటంతో ఉద్యోగుల సం ఖ్య పెరిగింది. దీంతో వారి రాకపోకలకు క్యా బ్‌లు, ఆటోలే కీలకంగా మారాయి. ఉబె ర్‌, ఓలా క్యాబ్‌ సర్వీస్‌లో చాలా మంది వాహనాలను రిజిస్టర్‌ చేసుకుని, రో జుకు 15 నుంచి 20 వరకు ట్రిప్పు లు చేస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని, సాధారణ డ్రైవ ర్లు సైతం వాహన రంగంలో ఉ పాధి పొందుతున్నారు. అటు ఉబెర్‌, ఓలా ఆర్డర్స్‌ తీసుకుంటూనే ఇటు సాధారణ గిరాకీ చేస్తున్నారు.

పారిశ్రామిక ప్రగతి

టీఎస్‌ ఐ-పాస్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు గ్రేటర్‌కు క్యూ కడుతున్నాయి. పరిశ్రమలు తరలివెళ్తాయన్న దుష్ప్రచారాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్‌ పెట్టుబడుల గమ్యస్థానమైంది. ఇది వరకు వైజాగ్‌, విజయవాడ వైపు చూసిన పారిశ్రామికవేత్తలంతా ఇప్పుడు హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. వాతావరణం, ప్రశాంతత, శాంతిభద్రతలను చూసి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. ఈ ఐదేండ్లలో నాలుగు వేల పైచిలుకు కొత్త పరిశ్రమలొచ్చాయి. మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లాలో మూడు వేల పైచిలుకు కొత్త పరిశ్రమలు రావడం, సుమారుగా రెండు లక్షల కొత్త ఉద్యోగాలు దొరికాయి.

జగదీశ్‌ మార్కెట్‌తో 10వేల మందికి..

అర చేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు అడ్డాగా నగరంలోని జగదీశ్‌ మార్కెట్‌ సుపరిచితం. అంతర్జాతీయ బ్రాండ్స్‌ నుంచి మొదలు కొని అతి చిన్న కంపెనీల ఫోన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 3వేలకు పైగా షాపులు ఉండగా, అందులో 10వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు వచ్చేవారు సుమారు 45 నుంచి 55వేల మంది దాకా ఉంటారని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్రూప్‌ బజార్‌-అబిడ్స్‌

నగరంలో ఎంతో పురాతనమైన ఆర్థిక కేంద్రం ట్రూప్‌ బజార్‌. అటు కోఠి, ఇటు అబిడ్స్‌ ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రాంతంలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులతో పాటు ఎలక్ట్రికల్‌, శానిటరీ వేర్‌ ఉత్పత్తులు హోల్‌సేల్‌ ధరలకే విక్రయిస్తుంటారు. నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. సుమారు  5వేలకు పైగా చిన్న, పెద్ద హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపార సంస్థలు ఇక్కడ దశాబ్దాలు తరబడి కొనసాగుతున్నాయి. ఈ వ్యాపార కేంద్రంలో 25వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, వారిపై ఆధారపడిన వారు లక్షల వరకు ఉంటారు.

కోఠి ఎలక్ట్రానిక్స్‌

హైదరాబాద్‌లో కోఠి అంటేనే ప్రధాన వ్యాపార కేంద్రం. నివాస ప్రాంతం కన్నా ప్రధాన వ్యాపార కేంద్రంగా వర్థిల్లుతోంది. రేడియో, టీవీలు మొదలుకొని రకరకాల ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల విక్రయాలు, వస్ర్తాలు, మెడికల్‌ షాపులకు అవసరమైన మందులను సరఫరా చేసే ఏజెన్సీలు కోఠిలోనే ఉన్నాయి. కోఠి  కేంద్రంగా చేసుకొని 10వేలకు పైనే షాపులు ఉండగా, వాటి ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతున్న వారు 5వేల మంది దాకా ఉంటారు.

రాణిగంజ్‌ అగ్రి బిజినెస్‌

వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గృహ వినియోగ వస్తువులు, ఆటో మొబైల్‌కు సంబంధించిన ఉపకరణాల విక్రయాలకు సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌ ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడ 6వేలకు పైగా వ్యాపార సంస్థలు హోల్‌సేల్‌,రిటైల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీనిని ఆధారంగా  చేసుకొని 25వేల మంది ఉపాధి పొందుతున్నారు.

అశాంతి నెలకొంటే ఆగమే!

హైదరాబాద్‌ రియాల్టీకి శాంతిభద్రతలే గీటురాయి. సుస్థిర పాలన, పెట్టుబడుల ఆకర్షణగా ప్రభుత్వం సంస్కరణలు వెరసి గడిచిన ఆరున్నరేళ్లలో ఐటీ, ఇండ్రస్టీయల్‌, రియల్‌ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. ప్రధానంగా రియాల్టీ రంగంపై దాదాపు 250 రంగాలకు పైగా ఆధారపడి ఉన్నాయి. అడ్డా కూలీలు మొదలుకొని తాపీ మేస్త్రీలు, మార్బుల్‌ కటింగ్‌, వైరింగ్‌, పుట్టి, పెయింటింగ్‌ వర్కర్స్‌, సైట్‌ సూపర్‌వైజర్లు, సివిల్‌ ఇంజినీర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇటుక బట్టీలు, ఇసుక వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, ఆర్కిటెక్చర్లు.. ఇలా బడా పారిశ్రామికవేత్తల వరకు ఉన్నారు. దాదాపు బిల్డర్లు, డెవలపర్లు 2500 వరకు వ్యాపార కార్యకలాపాలు  నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా నిర్మాణ సమయంలో ఐదు లక్షల వరకు పనిచేస్తుండగా, మెటిరీయల్‌ సప్లయి తదితర మరో ఐదు లక్షలు వరకు పనిచేస్తున్నారు. అనుబంధం కలిసి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల కుటుంబాలు ఈ రియల్‌ రంగంపై ఉపాధి పొందుతున్నట్లు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

15.50లక్షల మంది వీధి వ్యాపారులు

నగరంలో రెండు లక్షలమంది వీధి వ్యాపారులున్నారు. గ్రేటర్‌ పరిధిలో ఇప్పటివరకు 154790 మంది వీధి వ్యాపారులను గుర్తించి, 134384మందికి గుర్తిం పు కార్డు లు జారీచేశారు. పలు ప్రాం తాల్లో వెండింగ్‌ జోన్లను కూ డా ఏర్పాటు చేశారు. ఇలా వివిధ రకాల వ్యాపారాలు, వీధి వ్యాపారాలపై 16లక్షలమందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు.

ఇక్కడ పనికి కొదువ లేదు 

మొదట్లో నగరానికి వచ్చే ముందు చాలా భయం వేసింది. ఎలా బతకడమోనని. కానీ ఇక్కడికి వచ్చాక పనికి కొదువ లేదు. ప్రతి రోజు  లేబర్‌ పని దొరుకుతాంది. ఒక అపార్ట్‌మెంట్‌ పూర్తయ్యే లోపున మరో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులు మొదలవుతుంటాయి. హైదరాబాద్‌లో నివసించడం అదృష్టంగా భావిస్తున్నా.- రాణి, వనపర్తి, కార్మికురాలు

హైదరాబాద్‌లో జాబ్‌ అదృష్టం 

హైదరాబాద్‌లో ఉండే కల్చర్‌ను ఇష్టపడే ఇక్కడికి వచ్చా. ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసే మహిళలకు భయం అవసరంలేదు. ఐటీ కారిడార్‌లో ఎటువైపు చూసిన పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు కనిపిస్తాయి. షీటీంలు ఉంటాయి. నిజంగా భద్రతకు పుట్టినిల్లు హైదరాబాద్‌. ఐ లవ్‌ హైదరాబాద్‌.  - కాంతి, ఐటీ ఉద్యోగి.

అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్‌ 

పనిలేక ఆకలితో బాధపడే నాకు ఉపాధి చూపించి అన్నం పెట్టిన నగరం హైదరాబాద్‌. కొన్ని రోజులు నిర్మాణ పనులు, మరికొన్ని రోజులు దుకాణాల్లో పని చేస్తుంటా. ప్రతి రోజు పని దొరుకుతుంది. కరోనా సమయంలో మాకు పనిచ్చే వాళ్లు పని చేయకున్నా డబ్బులిచ్చి ఆదుకున్నారు. మాలా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వాళ్లు చాలా మంది పని చేసుకుంటున్నారు.  - అబ్రహం, ఒడిశా

జేబులో రూపాయి లేకున్నా ఆదుకుంటుంది

మాది విజయనగరం. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాం. వచ్చిరాగానే పనిదొరికింది. ఏడేండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నా. మా ఊళ్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎలా బతుకుతావురా అక్కడ అని చాలా మంది అన్నారు. కానీ నేను కొబ్బరి బొండాల షాపు పెట్టుకున్న. మా ఊళ్లో వాళ్లు ఫోన్‌ చేసి ఏదైనా పని చూడమని అడుగుతున్నారు. హైదరాబాద్‌లో ఎలాగైనా బతుకొచ్చు. జేబులో రూపాయి లేకున్నా హైదరాబాద్‌ అన్నం పెడుతుంది. ఇక్కడి ప్రజలు ప్రేమ, దాతృత్వంగలవారు.  - గురుమూర్తి, కొబ్బరి బొండాల వ్యాపారి. 

హైదరాబాద్‌ నా జీవితాన్ని మార్చింది

మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జాలపల్లి. 17 ఏండ్ల కిందట ఉపాధి కోసం నగరానికి వచ్చా. మొదట లారీ క్లీనర్‌గా జీవితం ప్రారంభించి, ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేరా. రాష్ట్రమొచ్చాక నాలో ధైర్యం పెరిగింది. ఇటీవలే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ స్థాపించా. ఇప్పుడు నేను 20 మందికి ఉపాధిని కల్పిస్తున్నా. నగరమే నాకు దారులను చూపించింది. అందుకే హైదరాబాద్‌ నా శ్వాస లాంటిది. అలాంటి నగరం అభివృద్ధిలో మరింత దూసుకుపోవాలని భావిస్తున్నా. - ఎస్‌. రాజేందర్‌ రెడ్డి, చైర్మన్‌, ఎస్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌


logo