శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Jul 31, 2020 , 23:51:49

సైనికులకూ వృత్తి విద్యాశిక్షణ..

సైనికులకూ వృత్తి విద్యాశిక్షణ..

హైదరాబాద్‌లో రెండు ఆర్మీ ఆర్డినెన్స్‌ కాప్స్‌ సెంటర్లు

ఇంటర్‌బోర్డు ద్వారా అనుమతులు

9 రకాల స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశసేవ చేయలేని దేహమెందుకన్నట్లు.. అనునిత్యం దేశసేవకే అంకితమయ్యేది ఒక్క సైనికులు మాత్రమే. శత్రుదేశాల నుంచి సరిహద్దులను రక్షించడం.. దేశంలో శాంతిని నెలకొల్పడంలో వారి శ్రమ వెలకట్టలేనిది. యుద్ధాలు.. ఉగ్రమూకలను ఏరిపారేయడంలో సైనికుల త్యాగాలు అజరామరం. ఆర్మీ, నౌకా, వాయిసేనకు చెందిన సైనికులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ మాతృదేశాన్ని అనునిత్యం కాపాడుతున్నారు. ఇలా జన్మభూమి రక్షణ కోసం ఎండ.. వాన.. చలి అనక మనల్ని కాపాడుతున్న సైనికులకు తెలంగాణ ఇంటర్‌బోర్డు ద్వారా వృత్తివిద్యలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు వీలు కల్పిస్తూ  హైదరాబాద్‌లో రెండు ఆర్మీ ఆర్డినెన్స్‌ కాప్స్‌ సెంటర్ల ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో తొమ్మిది  రకాల స్వల్పకాలిక కోర్సుల్లో సైనికులకు తర్ఫీదునివ్వనున్నారు.

ఆర్మీ అవసరాలు తీర్చేందుకు..

యుద్ధాలు, దేశ భద్రతలో నిమగ్నమవుతున్న ఆర్మీ అవసరాలు తీర్చేందుకు వీలుగా అధికారులు రెండు ఆర్డినెన్స్‌ కాప్స్‌ సెంటర్లను నెలకొల్పారు. ఇందులో ఒకటి సికింద్రాబాద్‌, మరొకటి గోల్కొండలో ఏర్పాటు చేయగా.. సర్టిఫికెట్‌ కోర్సులకు సంబంధించి ఇప్పటికే ఇంటర్‌బోర్డు సిలబస్‌ను ఖరారు చేసింది. బోధకులను ఆర్మీ  వారే నియమించుకోనున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటర్‌ బోర్డు అధికారులు మూల్యాంకనం చేసి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలో మొదటి సారి హైదరాబాద్‌లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇందుకు ఇంటర్‌బోర్డు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.  

కోర్సులివే.. 

* పెయింటింగ్‌

* వుడ్‌వర్క్‌

* డ్రైవింగ్‌ (హెవీమోటార్‌, లైట్‌మోటార్‌)

* లెదర్‌ వస్తువుల తయారీ

* ఆర్మీ దుస్తుల తయారీ

* బ్యాగులు, సంచులు తయారీ

* టైలరింగ్‌

* ఆటోమొబైల్‌ మెకానిక్‌

* స్టిమ్యూలేటర్‌ 


logo