బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 07:23:12

ఓటెత్తనున్న ప్రముఖులు

ఓటెత్తనున్న ప్రముఖులు

  • బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్లలో 
  • ఓటేసేందుకు ప్రముఖులు రెడీ
  • సెయింట్‌ నిజామియా స్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో మంత్రి కేటీఆర్‌
  • ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఎన్టీఆర్‌, మెగాస్టార్‌..

బంజారాహిల్స్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్ల పరిధిలోని పోలింగ్‌ బూత్‌లలో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మంత్రులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ రెండు డివిజన్లలో నివాసముంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద వీరంతా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెంకటేశ్వరకాలనీ డివిజన్‌లోని సెయింట్‌ నిజామియా స్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో తన ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం ఉదయం 7గంటలకు మంత్రి కేటీఆర్‌ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయనున్నారని తెలుస్తున్నది. 

గత ఎన్నికల్లో కూడా ఇదే పోలింగ్‌ కేంద్రం వద్ద మంత్రి కేటీఆర్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో తన ఓటు వేయనున్నారు. ఇదే పోలింగ్‌ బూత్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, వారి కుటుంబ సభ్యులు కూడా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో హీరో మహేశ్‌బాబు, భారతీయ విద్యాభవన్‌ పోలింగ్‌ కేంద్రంలో మంచు మోహన్‌బాబు, మురళీమోహన్‌, రాఘవేంద్రరావు తదితరులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-65లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో హీరో అల్లుఅర్జున్‌, అల్లుఅరవింద్‌ తదితరులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


logo