e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ ఇలా రాక.. అలా టీకా

ఇలా రాక.. అలా టీకా

ఇలా రాక.. అలా టీకా
  • హైటెక్స్‌లో ఒకేరోజు 40 వేలమందికి టీకాలు
  • ఉదయం 8 నుంచి
  • రాత్రి 9 వరకు కార్యక్రమం
  • దేశంలోనే అతిపెద్ద డ్రైవ్‌..
  • వచ్చిన 5 నిమిషాల్లోనే టీకా
  • పక్కా ఏర్పాట్లు.. రద్దీ లేకుండా చర్యలు
  • ప్రారంభించిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
  • అపోహలు వీడి టీకా వేసుకోవాలని హితవు

మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమమిది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టీకాల ప్రక్రియ నిర్విరామంగా రాత్రి 9 వరకు సాగింది. ఈ మెగా డ్రైవ్‌లో ఒకేరోజు 40 వేలమందికి టీకాలు వేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మెడికవర్‌ హాస్పిటల్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డీహెచ్‌) శ్రీనివాసరావు, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌లు ప్రారంభించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ వెబ్‌సైట్‌, కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకాలు వేశారు. మొత్తం 100 కౌంటర్లలో 50 మంది వైద్యులు, 700 మంది నర్సులు, 450 మంది సిబ్బంది సాయంతో ఒక్కొక్కరికి ఐదు నిమిషాల్లోనే టీకా వేశారు. ఈ సందర్భంగా డీహెచ్‌ మాట్లాడుతూ కరోనా తగ్గుముఖం పట్టిందని కొందరు వ్యాక్సిన్‌ వేసుకోవడం లేదని, అపోహలు వీడి అర్హత ఉన్నవారు వెంటనే సమీపంలోని కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలన్నారు. టీకా తీసుకోవడం వల్ల కరోనా సోకినా ముప్పు చాలా తక్కువని పేర్కొన్నారు.

మాదాపూర్‌, జూన్‌ 6: అద్భుతం.. అమోఘం.. కరోనాకు కళ్లెం వేసేందుకు ఆదివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మాస్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ దిగ్విజయమైంది. యువతీయువకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నగర నలుమూలల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఈ డ్రైవ్‌ మహాక్రతువుగా సాగింది. ’మస్ట్‌ కమ్‌.. జస్ట్‌ గో’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 40 వేల మందికి టీకాలు వేశారు. 50 మంది వైద్యనిపుణులు, 700 మంది నర్సులు సేవలందించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌) సంయుక్తాధ్వర్యంలో మెడికవర్‌ వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఈ డ్రైవ్‌ను తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు ప్రారంభించగా, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ యోదుల్లా, తెలంగాణ, ఏపీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ గోవిందారి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.

50 మందివైద్య నిపుణులు..700 మంది నర్సులు

ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 50 మంది వైద్య నిపుణులు, 700 మంది నర్సులు భాగస్వాములయ్యారు. టీకా వేసుకున్న తర్వాత ఏదైనా సమస్య వస్తే చికిత్స అందించేందుకు నాలుగు పడకలను అందుబాటులో ఉంచారు. అలాగే మెడికవర్‌ దవాఖాన తరఫున 300 మంది అడ్మిన్‌ స్టాఫ్‌, ఎస్‌సీఎస్‌సీ నుంచి 150 మంది వలంటీర్లు సేవలందించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. టీకాల కోసం వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకునేందుకు మూడు హాళ్లలో వంద కౌంటర్లు ఏర్పాటు చేశారు.

సులభంగా రిజిస్ట్రేషన్‌..

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభంగా సాగేందుకు మెడికవర్‌ వైద్యశాల వారు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. దీంతో క్యూలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా కేవలం 5 నమిషాల్లో టీకా వేసేలా పక్కా ప్రణాళికలతో ఈ మాస్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టాం. 18 ఏండ్లు పై బడిన వారందరికీ టీకాలు వేశాం. ఎక్కడా జరుగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తిరిగి 45 రోజుల తర్వాత రెండో డోసు కోసం మరో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఏర్పాటు చేస్తాం. – కృష్ణ యెదుల్లా, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి

ఐదు నిమిషాల్లోనే..

టీకా వేయించుకునేందుకు వచ్చా. బయట జనాలను చూసి ఎంత సేపు వేచి చూడాల్సి వస్తుందేమోనని అనుకున్నా. ఇక్కడకు వచ్చాక సులభంగా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ..లోపలికి పంపించారు. ఐదు నిమిషాల్లోనే టీకా వేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక ధైర్యం వచ్చింది. టీకా వేసుకున్న వారికి కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నాతో పాటు నా స్నేహితులు చాలా మంది టీకా వేయించుకున్నారు. – డి. స్రవంతి, బీటెక్‌ గ్రాడ్యుయేట్‌

ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం కల్పించాం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మాస్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాం. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికీ టీకా అందేలా మెడికవర్‌ దవాఖాన వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో కొంత ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినా.. తక్షణమే స్పందించి క్రమబద్ధీకరించాం. వాహనదారుల కోసం జయభేరి వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించాం. టీకా కోసం వచ్చిన వారు గంటల తరబడి క్యూలో, వెయింటింగ్‌ హాల్‌లో ఎదురుచూడకుండా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే వ్యాక్సిన్‌ వేసి.. పంపించేలా చర్యలు తీసుకున్నాం. – వీసీ సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

కరోనాను తేలికగా తీసుకోవద్దు..

మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించిన తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కరోనాను తేలికగా తీసుకోవద్దని, మహమ్మారి తగ్గుముఖం పట్టిందని.. టీకాలు వేసుకోవాల్సిన అవసరం లేదన్న అపోహలు వీడి.. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 1000 వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 52 లక్షల మందికి టీకాలు వేయగా, మరో 2.7 కోట్ల మందికి వేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు వేసుకున్న టీకాతో కరోనా మూడో దశను అధిగమించవచ్చన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా.. మాస్కులు ధరించి..భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎక్కడా జరుగలేదన్నారు. -తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇలా రాక.. అలా టీకా

ట్రెండింగ్‌

Advertisement