సోమవారం 13 జూలై 2020
Hyderabad - May 26, 2020 , 01:10:47

కట్టుదిట్టమైనా.. కనికరించని వైరస్‌

కట్టుదిట్టమైనా.. కనికరించని వైరస్‌

కార్వాన్‌ నియోజకవర్గంలోని జియాగూడ దాని పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.  ప్రతిరోజు ఈప్రాంతంలో  ఎక్కడో ఒక దగ్గర కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కంటైన్మెంట్‌లో ఉన్న నాలుగు జోన్లలో కార్వాన్‌ జోన్‌ ప్రధానమైనది. ఈ జోన్‌ పరిధిలోని ఒక్క జియాగూడలోనే ఈనెల 24 వరకు 90 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక శాతం కుటుంబ సమూహాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒకే కుటుంబంలో వచ్చిన 15 కేసులు జియాగూడతో ముడిపడి ఉన్నవే. జుమ్మెరాత్‌బజార్‌, ఆసిఫ్‌నగర్‌, బాంజివాడ ఇలా చాలా ప్రాంతాలకు జియాగూడ నుంచే కేసులు వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా కాలం మొదట్లో ఒక్క కేసు కూడా నమోదుకాని కార్వాన్‌ నియోజకవర్గంలో  ప్రస్తుతం కేసుల సంఖ్య 100 దాటింది. మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి.  

భయంగుప్పిట్లో జనం

జియాగూడను పూర్తిగా క్వారంటైన్‌ చేశారు. ఏ ఒక్క దుకాణానికి అనుమతించకుండా షాపులు మూసి ఉంచుతున్నారు. స్థానికంగా ఉన్న సబ్జిమండితో పాటు గొర్రెలు, మేకల మండి సైతం మూసివేశారు. జనం ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదు. అయినా కేసుల పరంపర ఆగడం లేదు. ప్రతి రోజు జియాగూడ, దాని పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 

నిర్లక్ష్యమే కారణమా.. 

లాక్‌డౌన్‌ కాలంలో కొందరి నిర్లక్ష్యమే కొంపముంచినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా రెండు మార్కెట్లు ప్రధానంగా నిలిచినట్లు తెలుస్త్తుంది. ఒకటి గొర్రెలు, మేకల మండి, రెండు పాత సబ్జిమండి(కూరగాయల మార్కెట్‌). ఈ రెండు మార్కెట్ల వల్లనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జియాగూడ కబేళాకు లాక్‌డౌన్‌ సమయంలో కూడాగొర్రెలు, మేకల లారీలు వచ్చాయని,  అవికూడా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


logo