బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 02:27:19

అయ్యో చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందో..

అయ్యో చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందో..

హైదరాబాద్ :  అయ్యో చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందో.. ముద్దులొలుకుతున్న ముక్కపచ్చలారని ఆ పసికందును వదిలి వెళ్లేందుకు మనసెలా వచ్చిందో.. అభం శుభం తెలియని ఆ పసిగుడ్డును జాలి, దయ లేకుండా పడేసేందుకు చేతులెలా వచ్చాయోనని ప్రతి హృదయం చలించిపోయింది. నల్లకుంట ఫీవర్‌ దవాఖానలోని చెత్త డబ్బాలో ఆడ శిశువు లభించడం అందరి మనసు కలిచివేసింది. శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటోలో ఆస్పత్రికి వచ్చిన నలుగురు వ్యక్తులు ఓపీ ఫార్మసీకి వెళ్లే దారిలో చెత్తడబ్బాలో శిశువును పడేసి వెళ్లిపోయారు.  

ఆరుగంటల సమయంలో పారిశుధ్య కార్మికులు వ్యర్థాలు వేసేందుకు వెళ్లగా, రక్తపు మరకలతో ఉన్న శిశువును గుర్తించారు. బయటికి తీయగా, ఏడవడం మొదలుపెట్టడంతో బెడ్‌పైకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు శిశువును నిలోఫర్‌ వైద్యశాలకు తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించగా, నలుగురు ఆటోలో వచ్చినట్లు రికార్డయింది. వారు ముఖాలకు ముసుగులు ధరించి ఉండడంతో గుర్తించడం కష్టమవు తున్నది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.          


logo