గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:23:25

రోడ్డుపై పసికందు..

రోడ్డుపై పసికందు..

  • వదిలేసివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  • అక్కున చేర్చుకుని పోలీసులకు అప్పగించిన        స్థానిక మహిళ.. శిశువిహార్‌కు తరలింపు

కూకట్‌పల్లి : ప్రాణం పోసుకుని గంటలు కూడా కాకుండానే ఓ పసికందు రోడ్డున పడ్డాడు. మూసాపేట సర్కిల్‌ పరిధిలోని జనతానగర్‌ కాలనీలో ఇండ్ల మధ్యలో ఉన్న చిన్న గల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు  అప్పుడే పుట్టిన మగశిశువును బొడ్డు తాడు కూడా కోయకుండానే వదిలేసి వెళ్లి పోయారు. చిన్నారి ఏడుస్తున్న శబ్దం విన్న.. స్థానికంగా ఉండే కుమారి అనే మహిళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పరిశీలించగా ఇంటి పక్కనే ఉన్న ప్రదేశంలో గాజు పెంకులు, చెత్తా చెదారం ఉన్న చోట అప్పుడే పుట్టిన పసికందును గమనించింది. దీంతో స్థానికుల సహాయం తో పసికందును తన ఇంటికి తీసుకువెళ్లి బోడ్డు తాడును తొలగించి.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారి ఒంటిపై వీపు భాగంలో చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. అనంతరం కుమారి పసికందును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించింది. అడ్మిన్‌ ఎస్సై శంకర్‌.. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి.. చైల్డ్‌లైన్‌ సంస్థ సభ్యుల ద్వారా అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజుల క్రితం కైత్లాపూర్‌ వద్ద నెలన్నర వయస్సు ఉన్న ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు... సరిగ్గా రెండు రోజుల తరువాత మళ్లీ ఓ చిన్నారిని రోడ్డుపై వదిలేసి వెళ్లారు.