ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Aug 02, 2020 , 23:49:19

కుదరని ముహూర్తం

కుదరని ముహూర్తం

ప్రారంభానికి నోచుకోని వైనం

ఐదేండ్లైనా పట్టించుకోని అధికారులు

పార్కింగ్‌కు అడ్డాగా మారిన అడిక్‌మెట్‌ కమ్యూనిటీహాల్‌

ముషీరాబాద్‌ : అక్షరాల కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన అడిక్‌మెట్‌ కమ్యూనిటీహాల్‌ ఐదేండ్లుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. బస్తీ వాసులు, నేతల మధ్య ఆదిపత్య పోరు, నిర్వాహణ ఎవరు చేపడతారు.. అనే అంశంపై తొలగని సందిగ్దత వెరసి అన్ని హంగులతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ ఎందుకు పనికిరాకుండా పోతుంది. నిర్మాణం పూర్తయిన కమ్యూనిటీ హాల్‌ను వినియోగించకపోవడం, నిర్వహణ లోపం కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. గతంలో కమ్యూనిటీ హాల్‌లో అన్ని వసతులు కల్పించి ప్రారంభానికి ఏర్పాట్లు చేసిన అధికారులు వివిధ కారణాలతో రెండేళ్ల పాటు ప్రారంభించలేదు. 

దీంతో అందులో ఏర్పాటు చేసిన ఫ్యాన్‌లు, స్వీచ్‌బోర్డులు, ఇతర ఖరీదైన వస్తువులు దొంగలపాలయ్యాయి. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యం కారణంగా కమ్యూనిటీహాల్‌ ఎందుకు పనికిరాకుండా పోయింది. రెండేండ్ల క్రితం అప్పటి జోనల్‌ కమిషనర్‌ కమ్యూనిటీ హాల్‌ను సందర్శించి వెంటనే కనీస వసతులు కల్పించి త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మళ్లీ దాదాపు రూ. 15లక్షలు వెచ్చించి వసతులు కల్పించి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసి రెండేండ్లు అవుతోంది. 

ఏడేండ్ల క్రితమే నిర్మాణం...

అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఉన్న మైదానంలో ఐదు సంవత్సరాల క్రితం కమ్యూనిటీహాల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వం గ్రౌండ్‌, మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టింది. భారీ ఫంక్షన్‌హాల్‌ను తలపించేలా కమ్యూనిటీహాల్‌ను నిర్మించిన అధికారులు అందులో అన్ని ఏర్పాట్లు చేశారు. సదస్సులు, సమావేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువుగా వసతులు కల్పించారు. 

త్వరలో ప్రారంభించడానికి చర్యలు

అడిక్‌మెట్‌ కమ్యూనిటీహాల్‌ను త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. భవనం లోపల ఎన్నికల విభాగానికి సంబంధించిన వీల్‌ చైర్స్‌ నిల్వ ఉంచడం జరిగింది. త్వరలో వాటిని తొలగించి భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తాం.

- ఉమాప్రకాశ్‌, 

డిప్యూటీ కమిషనర్‌ సర్కిల్‌-15