మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 07:54:04

జీతం ఇవ్వలేదని చోరీలకు పాల్పడ్డారు...

జీతం ఇవ్వలేదని చోరీలకు పాల్పడ్డారు...

జీతాలు చెల్లించడంలేదని.. చోరీకి పాల్పడ్డారు


  • ఇద్దరు సెక్యూరిటీ గార్డులతోపాటు మరొకరు అరెస్ట్‌ 
  • రూ.11.9లక్షల విలువగల సామగ్రి స్వాధీనం  

పహాడీషరీఫ్‌ : కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీ యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదని... అందులో చోరీకి పాల్పడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులతోపాటు మరొకరిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి వివరాల ప్రకారం... మహేశ్వరం మండలం, తుక్కగూడ, రావిర్యాల సమీపంలోని ఫ్యాబిసిటీలో 2008లోఎక్స్‌ఎల్‌ ఎనర్జీ సోలార్‌ కంపెనీని స్థాపించారు. అయితే ఆర్థిక భారంతో కంపెనీని ప్రారంభించలేదు.  అందులో ఉన్న సామగ్రిని కాపాడడానికి రావిర్యాల గ్రామానికి చెందిన జేమ్స్‌(30)ను సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా, పాశం లింగం(30)ను సెక్యూరిటీ గార్డుగా కంపెనీ  నియమించింది. కరోనా నేపథ్యంలో 8 నెలలుగా యాజమాన్యం వారికి జీతాలు ఇవ్వడంలేదు.  దీంతో జేమ్స్‌,  పాశం లింగంతో కలిసి కంపెనీలోని సామగ్రిని చోరీ చేయాలని ప్లాన్‌ వేశాడు. చోరీ చేసిన వస్తువులను విక్రయించడానికి  స్నేహితుడు శ్రీపద్‌రెడ్డిని కలుపుకున్నాడు. ఇతడు నారాయణగూడలోని  ఓ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఆగస్టు మొదటి వారంలో కంపెనీలో దాదాపు రూ. 40 లక్షల విలువ గల  కాపర్‌ మోటార్స్‌, ఇనుప పైపులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రి, ప్యానల్‌ బాక్సెస్‌, ఎయిర్‌ కండిషనర్‌ను చోరీ చేశారు. ఈ నెల 20న కంపెనీ మేనేజర్‌ ప్రకాశ్‌రెడ్డి చెక్‌ చేయగా .. పైపుల్లో తేడా వచ్చింది. మొత్తం చెక్‌ చేయగా 15 మోటార్లు, ఎయిర్‌ కండిషనర్‌ చోరీకి గురైనట్లు గుర్తించి.. 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి చోరీకి పాల్పడిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 11.9లక్షల విలువగల సామగ్రి, రూ.3.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.