e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home హైదరాబాద్‌ ఊపిరి తీసిన విషవాయువు

ఊపిరి తీసిన విషవాయువు

  • డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసే క్రమంలో విషాదం
  • మురుగునీటిలో గల్లంతైన ఇద్దరు కార్మికులు
  • ఒకరి మృతదేహం లభ్యం.. మరో శవం కోసం గాలింపు చర్యలు
  • బీఎన్‌రెడ్డి నగర్‌లో దుర్ఘటన

చిన్న పని.. తొందరగా ముగించుకుని ఇంటికి వస్తామన్నారు. రాత్రి సమయంలో పనులు వద్దని కుటుంబ సభ్యులు వారించినా.. పని ఉన్నప్పుడు తప్పదంటూ.. తొందరగా వస్తామని చెప్పారు. అంతలోనే ఆ ఇద్దరు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మంగళవారం రాత్రి డ్రైనేజీ శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు విషవాయువు పీల్చడంతో ఊపిరి ఆడక మురుగునీటిలో పడిపోయారు. చివరి క్షణంలో కూడా వారిద్దరూ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆ ఇద్దరూ మురుగునీటిలో పడి గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం లభించింది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగింది..?

నల్గొండ జిల్లా ముష్టిపల్లికి చెందిన నల్లవెల్లి అంతయ్య(47), డిండి మండలం ప్రతాప్‌నగర్‌కు చెందిన శివ(27) చంపాపేటలోని చింతల బస్తీలో ఉంటున్నారు. ఇద్దరు బంధువులు. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 9గంటల సమయంలో బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ సాహెబ్‌నగర్‌ పద్మావతి బ్యాంకు కాలనీలో మ్యాన్‌హోళ్లు శుభ్రం చేయాలని సూపర్‌వైజర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఆటోలో వీరిరువురు అక్కడికి వెళ్లారు. 11గంటల సమయంలో రెండు మ్యాన్‌ హోళ్ల మూతలు తొలగించారు. దీంతో శివ బకెట్‌కు తాడు కట్టి అందులో వేసేందుకు నిచ్చెన సహాయంతో లోపలికి దిగాడు. సగానికి పైగా దిగిన వెంటనే విషవాయువులతో పట్టుతప్పి లోపల పడిపోయాడు. గమనించిన సూపర్‌వైజర్‌ శివను కాపాడేందుకు అంతయ్యను లోనికి దింపాడు. అప్పటికే మురుగునీటిలో పడి ఉన్న శివ.. కాపాడు బావా.. అని కేకలు వేస్తూ అంతయ్య కాలు పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేశాడు. నిచ్చెన పట్టుతప్పిన అంతయ్య అమాంతంగా నీటి ప్రవాహంలో పడిపోయాడు. శివ కాలు నిచ్చెనకు చిక్కుకుపోవడంతో బయట ఉన్న మరో ఇద్దరు లోపలికి దిగి శివను బయటకు తీయగా అప్పటికే అతడు మృతి చెందాడు. అంతయ్య కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే బలితీసుకుంది

- Advertisement -

సాహెబ్‌నగర్‌ డ్రైనేజీ ఘటనకు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని రూఢీ అయ్యింది. దీంతో వనస్థలిపురం పోలీసులు కాంట్రాక్టర్‌ వరికుప్పల స్వామిపై స్కావెంజర్‌ యాక్ట్‌ 2013, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌, సెక్షన్‌ 304ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత దర్యాప్తు చేపడుతామని ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.

శోక సంద్రంలో నిండు గర్భిణి…

ప్రమాదంలో మృతి చెందిన శివ భార్య రాజేశ్వరి 8 నెలల గర్భవతి. ఏడాది కిందట వీరికి వివాహం జరిగింది. పుట్టింటి వద్ద ఉన్న భార్యకు రాత్రి 9గంటల సమయంలో శివ ఫోన్‌ చేసి మాట్లాడాడు. రాత్రి పూట ఎందుకని ఆమె వారించగా.. పని ఉన్నప్పుడు తప్పదని చెప్పాడని, తనను త్వరగా తిని, నిద్రపొమ్మని చెప్పాడంటూ కన్నీటి పర్యంతమయ్యింది.

నా భర్తను నాకివ్వండి…

నా భర్తను నాకివ్వండి తీసుకుని పోతా.. అంటూ గల్లంతయిన అంతయ్య భార్య భాగ్యమ్మ విలపించింది. కొంచమే పని ఉన్నది.. తొందరగా ఇంటికి వస్తానని చెప్పిన భర్త డ్రైనేజీలో గల్లంతయ్యాడని, తన భర్తను తనకు అప్పగిస్తే అక్కడి నుంచి పోతానంటూ రోదించింది. రాత్రి నుంచి అందరూ వస్తున్నారు.. కానీ తన భర్తను చూపించడం లేదంటూ ఆవేదనతో కన్నీరు పెట్టుకుంది.

లభించని మృతదేహం…

అంతయ్య మృతదేహం బుధవారం అర్ధరాత్రి వరకు లభించలేదు. జీహెచ్‌ఎంసీ, ఫైర్‌, పోలీసు అధికారులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫైర్‌ ఇంజిన్‌ సహాయంతో ఒక్కో మ్యాన్‌హోల్‌లో నీటి ప్రెషర్‌ పెట్టి గాలిస్తున్నారు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో ఆపరేషన్‌ కొనసాగుతున్నది. మొత్తం 210మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఒకవేళ ఇక్కడ మృతదేహం లభించకుంటే సామనగర్‌ ట్రంక్‌లైన్‌లోకి వెళ్లే అవకాశముంది. అక్కడి నుంచి కుంట్లూర్‌ చెరువుకు చేరుకుంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు.

అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘన

సాహెబ్‌నగర్‌ ఘటనలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. మ్యాన్‌హోల్‌ లోపలికి దిగి పనిచేయవద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఒకవైపు, రాత్రిపూట డ్రైనేజీ పనులు చేయవద్దనే నిబంధనలు మరోవైపు ఉన్నా పట్టించుకోలేదు. కనీసం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. పనులు చేపట్టారు. ఈనెలాఖరు నుంచి జీహెచ్‌ఎంసీ నుంచి శివారు మురుగునీటి నిర్వహణ బాధ్యతలు పూర్తిగా జలమండలికి వెళ్తాయన్న ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టర్‌ ఎల్లయ్య అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోతే జలమండలి మళ్లీ కొత్తగా టెండర్‌కు వెళ్తుందని, చేసిన పనికి బిల్లులు రావడం కష్టమవుతుందని కాంట్రాక్టర్‌ భావించినట్లు సమాచారం. అందువల్లే అప్పటికప్పుడు ఇద్దరు కార్మికులను పిలిపించి పనులు చేపట్టారని భావిస్తున్నారు. వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం, కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌ ఘాటైన వాసనలతో ఊపిరి ఆడక కార్మికులు మృత్యువాత పడ్డారు.

మ్యాన్‌హోల్‌ క్లీనింగ్‌ ప్రక్రియ ఇలా..

వాస్తవానికి మ్యాన్‌హోల్‌ క్లీనింగ్‌లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతారు. తరచూ ఉప్పొంగే మ్యాన్‌హోల్‌ మూతను తెరచి 10-15 నిమిషాలు అనంతరం విష వాయువులన్నీ పూర్తిగా పోయిన తర్వాత జెట్టింగ్‌ యంత్రం పైపులైన్‌ ద్వారా ఫ్రెష్‌ వాటర్‌తో పిచికారీ చేస్తారు. మ్యాన్‌హోల్‌లోకి సిల్ట్‌ గిరాబార్‌ దింపి పేరుకుపోయిన వ్యర్థాలను గాలి సహాయంతో తొలగిస్తుంటారు. దీనికోసం ఎయిర్‌టెడ్‌ వాహనాలు వాడుతారు. ఇందులో మురుగునీటిని తోడేందుకు మోటారు, మురుగునీటి వ్యర్థాలను నిల్వచేసే స్టోర్‌ ట్యాంకు యంత్రం, హోస్‌పైపు, వంటి ఉపకరణాలుంటాయి. అంతేకాదు.. సీవరేజీ క్లినింగ్‌లో బ్యాక్టీరియా ఫ్రీ డ్రెస్సెస్‌’ను పక్కాగా అమలు చేస్తున్నారు. హెడ్‌లైట్‌తో కూడిన హెల్మెట్‌, గమ్‌ బూట్లు, వాటర్‌ ఫ్రూఫ్‌ బట్టలు, గ్లౌజులు, సురక్షితమైన బెల్టు, ఆక్సిజన్‌ మాస్కు, రసాయన క్యాథరేజ్‌ మాస్కుతో పాటు మురుగునీటి నిర్వహణలో వ్యర్థాలు, పూడికతీత సదరు కార్మికుడిపై పడిన ఒంటి మీద ధరించిన బ్యాక్టీరియా ఫ్రీ డ్రెస్‌ ఏమీ కాకుండా రక్షణగా ఉంటుంది.

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం – జీహెచ్‌ఎంసీ

ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనను జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా తీసుకుందని, బాధ్యుడైన సదరు కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు బుధవారం ప్రకటించారు. కాంట్రాక్టర్‌ ఎల్లయ్య నిబంధనలకు విరుద్ధంగా డీ సిల్టింగ్‌ పనులు చేయించారని పేర్కొన్నారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్‌, సూపర్‌వైజర్‌లు పని చేయించారని అధికారులు పేర్కొన్నారు.

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం…

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఉదయం నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పరిశీలించారు. మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబాలకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రూ.50వేలు చొప్పున, బీఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి రూ.25వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. బాధితులను చంపాపేట్‌ కార్పొరేటర్‌ వంగా మధుసూదన్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌, సామ రంగారెడ్డి, మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, పరామర్శించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana