శుక్రవారం 22 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 08:57:23

జైల్లో పరిచయం చోరీలకు పథకం

జైల్లో పరిచయం చోరీలకు పథకం

  • కారులో తిరుగుతూ 7 చోరీలు
  • ఇద్దరు అరెస్టు.. రెండు తుపాకులు పట్టివేత
  • 36 తులాల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌  : జైల్లోపరిచయమైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు దొంగల అవతారం ఎత్తారు.. ఉత్తరప్రదేశ్‌ జైల్లో చోరీలకు పథకం వేసి, హైదరాబాద్‌లో అమలు చేశారు.  కారులో తిరుగుతూ ఏడు దొంగతనాలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఇద్దరు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.  గచ్చిబౌలీ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, అమ్రోహ ప్రాంతానికి చెందిన అహ్మద్‌ ఫహీం, ముర్‌సలీమ్‌ పాత నేరస్థులు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌ కేసుల్లో వేర్వేరుగా అరెస్టయిన వీరు మొరాదాబాద్‌ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ కలిసి గ్లాస్‌ కట్టింగ్‌ పనులను చేపట్టారు. 

ఆ ఆదాయం సరిపోకపోవడంతో చోరీలకు పథకం వేసుకున్నారు. ఇందుకోసం మరో స్నేహితుడు ఆరీఫ్‌కు చెందిన కారు తీసుకుని ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. సంపన్నులు నివసించే కాలనీల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇండ్లను గుర్తించి దొంగతనాలకు ప్లాన్‌చేశారు. ఈ క్రమంలో అల్వాల్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లోని 7 ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. తర్వాత కారు నంబర్‌ ప్లేట్లను మారుస్తూ హర్యానా పారిపోయారు. ఘటనా స్థలాల్లో దొరికిన కొన్ని ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హర్యానాలోని సోహానాలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 36 తులాల బంగారం, 36 గ్రాముల వెండి ఆభరణాలు, బంగారం తూకం వేసే పరికరం, బంగారాన్ని కరిగించే టూల్‌కిట్‌, 12 మొబైల్‌ ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న బాలానగర్‌ ఎస్వోటీ బృందాన్ని సీపీ సజ్జనార్‌ అభినందించారు.  ప్రజలు ఇండ్లకు తాళం వేసి బయటికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ కోరారు. ఖరీదైన వస్తువులను లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 100 లేదా వాట్సాప్‌ నంబర్‌ 94906 17444 కు సమాచారం ఇవ్వాలని కోరారు.  logo