సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Sep 03, 2020 , 00:14:15

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

దుండిగల్‌: వేర్వేరు ఘటనల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల కథనం.. రంగారెడ్డి జిల్లా, తెలకొండపల్లి మండలం, చౌదరిపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు చంద్రకాంత్‌రెడ్డి(35) నగరశివారు, నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, బాచుపల్లిలోని డా. రెడ్డీస్‌ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి బీహెచ్‌ఈఎల్‌లోని ఎంఐజీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో చంద్రకాంత్‌రెడ్డి రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం తనబైక్‌(టీఎస్‌ 11 ఈజీ 7586)పై కంపెనీకి బయలుదేరాడు. బాచుపల్లి చౌరస్తాదాటి ముందుకు వెళ్తుండగా వెనుకనుంచి దూసుకువచ్చిన డీసీఎం(ఐషర్‌) చంద్రకాంత్‌రెడ్డి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌రెడ్డి రోడ్డుపై పడిపోగా డీసీఎంకు ఉన్న కాంక్రీట్‌ మిక్చర్‌పంపు చక్రాలు అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు డీసీఎం వాహన యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీవైద్యశాలకు తరలించారు.

రోడ్డు దాటుతుండగా వృద్ధురాలు.. 

మాదాపూర్‌: రోడ్డు దాటుతుండగా ఆటో ట్రాలీ ఢీ కొట్టడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్‌ కథనం ప్రకారం.. నందిమల్ల గ్రామం, వనపర్తి జిల్లాకు చెందిన ఎల్లమ్మ (60) బతుకు దెరువు కోసం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం సమయంలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రోడ్డులో కూలీపని చేసిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ట్రాలీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ ఆటోను అక్కడే నిలిపివేసి పరారయ్యాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.