శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 07:01:59

ప్రారంభానికి చేరువలో రెండు జంక్షన్లు.. చివరి దశలో ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌ జంక్షన్ల అభివృద్ధి పనులు

ప్రారంభానికి చేరువలో రెండు జంక్షన్లు.. చివరి దశలో ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌ జంక్షన్ల అభివృద్ధి పనులు

అబిడ్స్‌ : నగర సుందరీకరణలో భాగంగా నగరంలో పలు జంక్షన్లను అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా  జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో చేపట్టిన అబిడ్స్‌, మొజాంజాహి మార్కెట్‌ జంక్షన్‌ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండు జంక్షన్ల అభివృద్ధికి గాను ఒక్కో జంక్షన్‌కు రూ. 19.75 లక్షలు విడుదల చేసి పనులను చేపడుతున్నారు. మార్చి మాసంలో ప్రారంభమైన పనులు అక్టోబర్‌లో పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా చౌరస్తాలో చిన్నపాటి లాన్‌, బెంచీల ఏర్పాటు, పలు రకాల విద్యుత్‌ దీపాలంకరణ వంటి పనులను చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌కపూర్‌ పర్యవేక్షణలో ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు జంక్షన్ల అభివృద్ధి చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఈ జంక్షన్లను పలుమార్లు సందర్శించి పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

త్వరలో ప్రారంభం కానున్న జంక్షన్లు..

జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ కార్యాలయం పరిధిలోని మొజాంజాహి మార్కెట్‌, అబిడ్స్‌ జంక్షన్‌ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకోవడంతో రెండు జంక్షన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు జంక్షన్లలో గార్డెనింగ్‌, సామగ్రిని అమర్చాల్సి ఉంది. ఆ పనులు కూడా పూర్తయితే రెండు జంక్షన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 


జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నాం

సర్కిల్‌ పరిధిలోని మొజాంజాహి మార్కెట్‌, అబిడ్స్‌ జంక్షన్ల అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కోఠి మహిళా కళాశాల జంక్షన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. సర్కిల్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

- వినయ్‌కపూర్‌,

 జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌