శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:29:02

నగర శివారు ఐదు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఆపరేషన్స్‌

నగర శివారు ఐదు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఆపరేషన్స్‌

హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నగరానికి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడిపింది. ఉదయం 6 గంటల నుంచి బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్నాయి. అయితే ఆర్టీసీ బస్సులు నగరం లోపలికి రావొద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగర శివారు ప్రాంతాల నుంచే బస్సుల రాకపోకలు జరిగాయి. ఎంజీబీఎస్‌ బస్టాండు, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్లకు బస్సులు రావడాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నగరం చుట్టు పక్కల ఐదు ప్రాంతాలైన హయత్‌నగర్‌, ఉప్పల్‌, జేబీఎస్‌, టీఎస్‌పీఏ జంక్షన్‌, ఆరాంఘర్‌ నుంచి బస్సులను నడిపించారు. 

జేబీఎస్‌ నుంచి ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లోని ప్రాంతాలకు బస్సులను నడుపగా, ఉప్పల్‌ నుంచి ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు బస్సులు ఆపరేట్‌ చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి రాకపోకలు సాగించే బస్సులను నగరానికి రాకుండా హయత్‌నగర్‌ ప్రాంతం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వికారాబాద్‌, చేవెళ్ల ప్రాంతం నుంచి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో రాకపోకలు సాగించే బస్సులను తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) జంక్షన్‌ వరకు అనుమతించారు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి నగరానికి రాకపోకలు సాగించే బస్సులను ఆరాంఘర్‌ ప్రాంతానికే పరిమితం చేశారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ బస్సులను మాత్రమే ఆపరేట్‌ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ప్రయాణికులు కూడా మాస్కులు వాడితేనే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిచ్చారు. 

ఏడు గంటల్లోపు డిపోలకు చేరేలా షెడ్యూల్‌..

రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి బస్సు బయలుదేరినా ఏడు గంటల లోపు డిపోకు చేరేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి బస్సు బయలుదేరిన దూరాన్ని అంచనా వేసి షెడ్యూల్‌ రూపొందించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు నిర్ణీత సమయంలోగా సొంత డిపోలకు చేరుకునే సమయం లేకపోతే నైట్‌హాల్ట్‌ ఉండేలా ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తులను దూరంగా సీట్లలో కూర్చోబెడుతున్నారు. బస్సులో ముగ్గురు కూర్చునే సీట్లలో ఇరు చివర్లకు ఒక్కొక్కరిని, ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్క ప్రయాణికుడిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఐతే మొదటిరో జు బస్సుల్లో రద్దీ లేదు. బస్సుల ఆపరేషన్స్‌ను ఎప్పటికప్పుడు కంట్రోలర్లతో అధికారులు సమన్వయం చేసుకుంటూ నడిపిస్తున్నారు.

నల్లగొండ-ఖమ్మం సెక్టార్లలో 98 బస్సులతో 1098 మంది గమ్యస్థానాలకు చేరిక 

హయత్‌నగర్‌ : హయత్‌నగర్‌ బస్ట్టాండ్‌ నుంచి ఖమ్మం సెక్టార్‌లో మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం రూట్‌లో మొత్తం 30 బస్సులతో 259 మంది గమ్యస్థానాలకు చేరుకున్నారు. నల్గొండ సెక్టార్‌లో నకిరేకల్‌, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ తదితర రూట్‌లలో సుమారు 68 బస్సులు రాకపోకలు సాగించగా, 833మంది గమ్యస్థానాలకు వెళ్లారు. మొత్తం రెండు సెక్టార్లలో 98ఆర్టీసీ బస్సుల రాకపోకలతో 1098మంది తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రతి బస్సును పూర్తిగా శానిటైజేషన్‌ చేయడంతో పాటు బస్సులో శానిటేషన్‌ బాటిల్‌ను అందుబాటులో ఉంచారు. ఒక్క బస్సులో 10-15 మందిని మాత్రమే అనుమతించారు.


logo