సోమవారం 25 మే 2020
Hyderabad - Apr 05, 2020 , 03:38:46

కూపీ లాగుతున్నారు

కూపీ లాగుతున్నారు

  • కరోనా సోకినవారు ఎవరెవరిని కలిశారో మ్యాపింగ్‌ వేసుకొని ఆరా తీస్తున్న పోలీసులు
  • ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన వారి మొబైల్‌ ఫోన్‌ల విశ్లేషణ... 
  • వారితో మాట్లాడిన వారి ఫోన్‌ నంబర్లూ గుర్తింపు

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది... ఇందులో వైద్యులు, పోలీసులు, ప్రజలు కూడా భాగస్వాములై వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నారు... అయితే కొందరు మాత్రం తప్పుడు ఆలోచనతో వ్యాధి సోకిందని తెలిసినా.. యథేచ్ఛగా బయట తిరుగుతూ..ఇతరులకు వ్యాపింపచేస్తున్నారు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ  ప్రార్థనలకు వెళ్లివచ్చినవారిని గుర్తించడంతోపాటు వారు ఎవరెవరిని కలిశారనే దానిపై కూపీ లాగుతున్నారు. 

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో బలమైన పెట్రోలింగ్‌ వ్యవస్థతో 24 గంటలూ పోలీసులు పనిచేస్తున్నారు. పెట్రోలింగ్‌ వాహనాలు క్వారంటైన్‌ సెంటర్లు, దవాఖానలు, పాజిటివ్‌ కేసులు వచ్చిన వారి ఇండ్లకు వెళ్తున్నాయి. వాటి ద్వారా వైరస్‌ విస్తరించకుండా మహావీర్‌ గ్రూప్‌ సహకారంతో 122 పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలకు శానిటైజేషన్‌ చేస్తున్నాం. దీని వల్ల ఐదు రోజుల పాటు ఎలాంటి వైరస్‌ దరిచేరదు. వాహనాలకు దశలవారీగా శానిటైజేషన్‌ పూర్తవుతుందన్నారు. సిబ్బంది కూడా శానిటైజర్స్‌, మాస్క్‌లు వాడాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఢిల్లీ నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ జమాత్‌ ప్రార్థనలకు  వెళ్లివచ్చిన వారు... అక్కడికి వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టి వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు..దీంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులతో పాటు సైబరాబాద్‌ పోలీసులు నగరంలో తిష్టవేసిన వీరిని దాదాపు గుర్తించి.. వారు నగరానికి వచ్చి ఇప్పటి వరకు ఎంత మందిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. దీని కోసం పోలీసులు క్రైం ఇన్విస్టిగేషన్‌ ప్రారంభించారు. ప్రాథమిక దశలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారి కాల్‌డేటాను ఆరా తీస్తున్నారు. వారు నగరానికి ఎప్పుడు వచ్చారు... ఆ తర్వాత ఎన్ని చోట్ల తిరిగారు... ఎవరెవరిని కలిశారు.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మ్యాపింగ్‌ చేసుకుని...  వారిని తాకిన ఇతరులను గుర్తిస్తున్నారు.

ఢిల్లీ టూ జగద్గిరిగుట్ట.. 200 మందిని తాకాడు... 

జగద్గిరిగుట్ట చంద్రగిరినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం మొదలైంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అతను ఢిల్లీ తబ్లిగ్‌ జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడని తేలింది. అతను మార్చి 17 తర్వాత ఢిల్లీ నుంచి నగరానికి వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను దాదాపు 200 మందిని కలిసినట్లు తేలింది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా అతను సహకరించకుండా విషయాన్ని దాచిపెట్టడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురై కరోనాతో మరణించాడు. అతను ఇటీవల ఓ దావతుకు కూడా వెళ్లాడని తెలిసింది. ఇలా.. అతన్ని కలిసిన వారిని మ్యాపింగ్‌ చేసిన పోలీసులు వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు ప్రారంభించారు. అతన్ని కలిసినవారిలో ఇతర జిల్లాలకు చెందిన 15 మంది ఉండగా.. వారి వివరాలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించి.. ఆ జిల్లా పోలీసు అధికారులకు అందించి... వారు కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ విధంగా పోలీసులు 200 మందిని గుర్తించి వారిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేసి వ్యాధి వ్యాప్తికి కట్డడి వేశారు.

భారతమ్మ.. థైరాయిడ్‌ అనుకుంది..

చేవెళ్ల నియోజకవర్గం, చేగూరు గ్రామంలో మృతి చెందిన భారతమ్మకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. అయితే దీనిపై అనుమానాలను తొలగించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దీంట్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారతమ్మ ఇంట్లో   బీహార్‌కు చెందిన నలుగురు యువకులు అద్దెకు ఉంటూ.. స్థానికంగా పని చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వారు సొంత ఊరుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని తిరిగివస్తున్న వారితో కలిసి  సంపర్క్‌ క్రాంతి రైలులో ప్రయాణించారని... ఆ సమయంలో వారికి ఈ కరోనా వ్యాధి సోకిందని పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారి ఫోన్‌ నంబర్ల ఆధారంగా విశ్లేషించారు. 

అప్పుడు పోలీసులకు కొంత ప్రాథమిక సమాచారం లభించింది. ఇలా వచ్చిన వారికి ఆరోగ్యంలో ఎలాంటి తేడాలు కనిపించకపోవడంతో యథావిధిగా తిరిగారు. కిరాణా దుకాణం నిర్వహించే భారతమ్మ వద్దకు వీరు తరచుగా వెళ్లి... నిత్యావసర సామగ్రిని కొనుగోలు చేశారు. ఆ సమయంలో వీరి నుంచి ఆమెకు కరోనా సోకిందని స్పష్టమయ్యింది. అయితే అస్వస్థతకు గురైన భారతమ్మ తనకు థైరాయిడ్‌ ఉండడంతో గొంతు నొప్పి వచ్చిందని భావించి.. స్థానిక దవాఖానతో పాటు మహబూబ్‌నగర్‌లోని దవాఖానలో చూపించుకుంది. అయితే గ్రామంలో భారతమ్మ కరోనా వ్యాధితో మృతి చెందిందని తెలియగానే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రభుత్వం అక్కడ దాదాపు 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి భరోసాను కల్పించింది. పోలీసులు కూడా గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురవద్దని స్పష్టం చేస్తున్నారు.  


logo